సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నండూరి సాంబశివరావును కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖకు పొడిగింపునకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతిపాదనలు పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్‌లో సాంబశివరావు పదవీ కాలం ముగుస్తుంది. ప్రస్తుతం ఇన్‌చార్జి డిజిపిగానే కొనసాగుతున్న ఆయనకు మళ్లీ పొడిగింపు లభిస్తుందా అనే అంశంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. సాంబశివరావును డీజీపీగా కొనసాగించాలని పలువురు ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించిన నేపథ్యంలో డీజీపీ పదవీ పొడిగింపు అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే డీజీపీ పోస్టు కోసం ఇతర అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉన్నా సాంబశివరావు వైపే సీఎం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. పనితీరు, సామాజికవర్గ కోణంలో సాంబశివరావుకే ఆ పోస్టు మళ్లీ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దీనితో వెంటనే పదవీ పొడిగింపు కోరుతూ కేంద్ర హోంశాఖ, యుపీఎస్సీలకు ఫైల్ పంపించాలని సిఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment