బ్యాంకు అధికారులే బాధ్యులు | ap government circular on crop loan waiver | Sakshi
Sakshi News home page

బ్యాంకు అధికారులే బాధ్యులు

Published Wed, Jan 14 2015 2:13 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

బ్యాంకు అధికారులే బాధ్యులు - Sakshi

బ్యాంకు అధికారులే బాధ్యులు

రుణ విముక్తిలో పొరపాట్లపై సర్కారు సర్క్యులర్

‘‘రుణం విషయంలో గానీ, ప్రభుత్వం విధించిన షరతుల విషయంలో గానీ, రుణ విముక్తికి అర్హత పొందిన మొత్తంలో గానీ ఎటువంటి తేడాలు జరిగినా, తప్పులు దొర్లినా ఆయా బ్యాంకు ఆఫీసర్లే బాధ్యత వహించాలి. అర్హత లేని రైతుల ఖాతాలకు గానీ లేదా అర్హత పొందిన సొమ్ముకు మించి గానీ జమ చేసిన పక్షంలో వెంటనే ఆ సొమ్మును ఆయా రైతుల ఖాతాల నుంచి ఉపసంహరించాలి.’’

సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ విముక్తిలో ఏవైనా తప్పులు జరిగితే సంబంధిత బ్యాంకు ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆర్థికశాఖ  మరో సర్క్యులర్ జారీ చేసింది. రుణ విముక్తిలో రైతులు తీసుకున్న రుణం విషయంలో గానీ, ప్రభుత్వం విధించిన షరతుల విషయంలో గానీ, రుణ విముక్తికి అర్హత పొందిన మొత్తం లో గానీ ఎటువంటి తేడాలు జరిగినా, ఆయా బ్యాంకు ఆఫీసర్లే బాధ్యత వహించాలని ఈ సర్క్యులర్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

బ్యాంకు ఆఫీసర్లు రుణ విముక్తి వివరాలను మరోసారి తనిఖీ చేయాలని, అన్నీ సవ్యంగా ఉన్నట్లు సంతృప్తి చెందితేనే ఆయా రైతుల ఖాతాలకు నిధులు జమ చేయాలని నిర్దేశించింది. పొరపాటు జరిగి అర్హత లేని రైతుల ఖాతాలకు గానీ లేదా అర్హత పొందిన సొమ్ముకు మించి గానీ జమ చేస్తే వెంటనే ఆ సొమ్మును ఆయా రైతుల ఖాతాల నుంచి ఉపసంహరించడంతో పాటు ఆ విషయాన్ని  తమకు తెలపాలని ప్రభుత్వం పేర్కొంది.

అర్హత పత్రాలను బాగా పరిశీలించాలి
అలాగే రైతుల దగ్గర నుంచి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకుని.. వారు విముక్తికి అర్హత పొందిన సొమ్మును వారి వారి ఖాతాలకు జమ చేయాలని సర్క్యులర్‌లో సూచించారు. రైతులు ఏదైనా కారణంతో అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వకున్నా అర్హత పొందిన సొమ్మును ఆ రైతుల ఖాతాలకు జమ చేయడంతో పాటు బ్యాంకు అధికారి ఆ రైతులకు సమాచారం పంపించాలని చెప్పారు. ఆ రైతుల ఖాతాలకు ఎంత మొత్తం జమ అయిందో బ్యాంకు అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వాలన్నారు. ఏదైనా నిబంధన కారణంగా రైతుల ఖాతాల రుణ విముక్తి పెండిం గ్‌లో ఉంచితే.. ఆయా రైతులు ఆ నిబంధనకు సంబంధించిన పత్రాలను తీసుకొస్తే పరిశీ లించి అర్హత గల సొమ్మును వారి ఖాతాలకు జమ చేయడంతో పాటు రైతులకు సమాచారమివ్వాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.

సగానికి కోసి.. ఐదో వంతు జమ..
అధికారంలోకి వస్తే తొలి సంతకంతోనే రాష్ట్రం లోని వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందిచ్చిన హామీ. ఏపీలో వ్యవసాయ రుణాలు తీసుకున్న మొత్తం కోటి మందికి పైగా రైతు ఖాతాలకు సంబంధించి 87,612 కోట్ల రూపాయల రుణాలున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు దాటుతుండగా ఇప్పటివరకు చంద్రబాబు చెల్లించింది ఎంత అంటే.. కేవలం రూ. 1,900 కోట్ల రూపాయలే. ఈ మొత్తమంతా రైతుల రుణాల వడ్డీకి కూడా సరిపోలేదు.

తొలి దశలో రుణ విముక్తికి అర్హులుగా తేల్చిన రైతుల ఖాతాల రుణాలు మొత్తం రూ. 24,001 కోట్లుండగా.. ప్రభుత్వం అనేక షరతుల ద్వారా దానిని రూ. 14,320 కోట్లకు కుదించింది. అందులోనూ ఈ ఏడాది తీర్చేది (20 శాతం) కేవలం రూ.4,663 కోట్లే. ఇందులో ఇప్పటివరకు రూ.1,900 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేశారు.  ప్రభుత్వం ఒకసారి రైతుల ఖాతాలను వడపోసిన తరువాత కూడా బ్యాంకులను బాధ్యులను చేస్తూ మళ్లీ పరిశీలించాలని ఆదేశించడంతో బ్యాంకు అధికారులు ఒకటికి రెండుసార్లు వివరాలను పరిశీలిస్తుండటంతో తొలి దశ 20 శాతం రుణ విముక్తి నిధుల జమ నత్తనడకన సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement