
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఎప్పటిలానే ఏప్రిల్ 1వ తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది.
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ నివారణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఏప్రిల్ 1న పెన్షన్లు పంపిణీకి సిద్ధమవుతోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పేదలకు ఆహార భద్రతలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాక్‌డౌన్ సందర్భంగా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయినా, రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినప్పటికీ, పెన్షనర్లను, పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఎప్పటిలానే ఏప్రిల్ ఒకటో తేదీనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ వలంటీర్ల ద్వారా పెన్షన్లను డోర్ డెలివరీ చేయనున్నారు.
- వీటితో పాటు సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విధంగా ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.1,000 చొప్పున ఏప్రిల్ 4వ తేదీన ఆర్థిక సహాయం చేయనున్నారు. దీనిని కూడా గ్రామ వలంటీర్లు ఇంటివద్దకు తీసుకువచ్చి ఇస్తారు.