సాక్షి, అమరావతి : కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ బిల్లు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెరతీశారని కాపు నేతలు మండిపడుతున్నారు. ఎలాంటి శాస్త్రీయతా లేని ఈ బిల్లుతో కాపులను మరోసారి మోసం చేస్తున్నట్లు కనిపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. మూడున్నరేళ్లపాటు తాత్సారం చేసి చివరకు మంజునాథ కమిషన్ చైర్మన్ నివేదిక సమర్పించకుండానే, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరిరోజున హడావిడిగా ఈ తంతు నడపాల్సిన అవసరమేమిటని కాపు నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఈ బిల్లు, తీర్మానం చేయించిందా? లేక ఎన్నికల సంవత్సరం దగ్గరపడుతున్నది కనుక తూతూమంత్రంగా చేతులు దులుపుకోవడానికి ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందా? అన్న అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారన్న విశ్లేషణలు రాజకీయవర్గాల్లో సాగుతున్నాయి. చడీచప్పుడు లేకుండా హఠాత్తుగా జస్టిస్ మంజునాథ్ నేతృత్వంలోని బీసీ కమిషన్ సభ్యులనుంచి నివేదికలు రప్పించి ఒకరోజు ముందు కేబినెట్ సమావేశంలో వాటిని ఆమోదించి ఆ వెనువెంటనే అసెంబ్లీ, మండలిలో ఆమోదింపచేయడం వెనుక అనేక ఎత్తుగడలు దాగి ఉన్నాయని కాపు నేతలు అంచనా వేస్తున్నారు. దీనిపై కేంద్రానికి నివేదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించడం ద్వారా కాపు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకొనే ఎత్తుగడగా వారు భావిస్తున్నారు.
పోలవరంపై నుంచి దృష్టి మళ్లించేందుకే..
పోలవరంలో వరుస తప్పులు క్రమంగా వెలుగులోకి వస్తుండటంతో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంపై వ్యాఖ్యలు చేసిన మరునాడే మాట మార్చారు. ఒకపక్క జగన్ పాదయాత్ర ప్రభావం, పోలవరంపై తాను చేసిన వ్యాఖ్యలు పార్టీ పట్ల వ్యతిరేకతకు దారితీస్తుండడం, కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చేలా ఉండడంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా కాపు రిజర్వేషన్లపై బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చారని విశ్లేషకులంటున్నారు. ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి దాన్ని పట్టించుకోకపోవడంతో ముద్రగడతో పాటు కాపు నాయకులు ఉద్యమాన్ని చేపట్టారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు సంబంధించిన అన్ని వివరాలున్నా మంజునాథ్ కమిషన్‌ను ప్రకటించినా కాలయాపన జరుగుతుందనే అనుమానాలు కాపు సామాజికవర్గంలో నెలకొన్నాయి. ముద్రగడ ఉద్యమం వివిధ దశలను దాటుకుని డిసెంబరు ఆరో తేదీ నుంచి ఉధృతం కాబోతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో చంద్రబాబు సర్కారు ఆలోచనలో పడింది. మరోవైపు ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో ఇంకా జాప్యం చేయడమంటే కాపు వర్గాల్లో మరింత వ్యతిరేకత పెంచుతుందని భావించడంతో కేంద్రంపై నెట్టేయడానికి వ్యూహం రచించినట్లు కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. కాపులను బీసీల్లోని చేర్చి రిజర్వేషన్లను తానే కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపైకి నెట్టేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపై తెలుగుదేశం పార్టీలోని కాపు నాయకులు అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏమాత్రం ఉన్నా ముందుగానే కేంద్రంతో సంప్రదింపులు జరిపి సానుకూలత సాధించుకునే వారని, కానీ అలాంటి కనీస ప్రయత్నం కూడా చేయకుండానే చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమంటే చేతులు దులిపేసుకోవడమేనని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే కేంద్రం పరిధిలో గుజ్జర్లు, పటేళ్లు, జాట్ల రిజర్వేషన్ సమస్య కొన్నేళ్లుగా నలుగుతూనే ఉందని, ఇప్పుడు కాపుల రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆ జాబితాలోకి చేర్చడం మినహా మరొకటి కాదని వారు గుర్తుచేస్తున్నారు.
కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకోవడమే..
ఎన్నికల ముందు ఇచ్చిన రిజర్వేషన్ల హామీ నెరవేర్చకపోవడంపై కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నాలుగేళ్లు గడిచిపోయాయి. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో ఈ అంశం మరింత జఠిలంగా మారుతుందన్న అభిప్రాయం బాబులో ఏర్పడిందంటున్నారు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల తరువాత మళ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రమే ఉన్నాయి. పార్లమెంటుకూ ఇదేరకమైన సమావేశాల షెడ్యూల్ ఉంటుంది. బడ్జెట్ తరువాత ఎన్నికల సీజనే. ఆ సమయం దగ్గరపడితే కాపులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు తలెత్తుతాయి. కనుకనే ఈ సమావేశాల్లోనే కాపు రిజర్వేషన్లపై బిల్లును ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్ చేర్చాలంటూ కేంద్రానికి పంపేస్తే అది కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతుందని, ఇక తమ చేతుల్లో ఏమీ లేదని, కేంద్రం నిర్ణయం తీసుకోవలసి ఉందని చెప్పడం ద్వారా తప్పించుకొనే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందన్న భావనతో బాబు హడావుడిగా కాపు రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తెచ్చారంటున్నారు. పార్లమెంటు సమావేశాల్లో కాపు రిజర్వేషన్లపై తమ సభ్యులతో కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా ఆ సామాజికవర్గం నుంచి సానుకూలత పొందడానికి వీలుంటుందని, కేంద్రంపై నెట్టేయడం ద్వారా తాను రాజకీయంగా క్షేమంగా ఉండవచ్చన్న ఎత్తుగడ ఇందులో దాగి ఉందని చెబుతున్నారు.
కమిషన్ నివేదిక చెల్లుబాటుపై పలు సందేహాలు
ఇలా ఉండగా కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం కమిషన్ రిపోర్టంటూ తెప్పించిన నివేదికల చెల్లుబాటుపై పలురకాల సందేహాలు టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ మంజునాథ్ ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిషన్ నివేదిక ఇంకా ఇవ్వలేదు. ప్రభుత్వం రెండురోజుల ముందు ఆ కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల నుంచి వేర్వేరుగా నివేదికలు తీసుకుంది. అయితే ఇలా వేర్వేరుగా, వ్యక్తిగతంగా సభ్యుల నుంచి తీసుకున్న నివేదికలు కమిషన్ రిపోర్టుగా పరిగణించడానికి వీల్లేదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. మొత్తం సమాచారాన్ని కమిషన్‌లోని సభ్యులందరి అభిప్రాయాలతో ఛైర్మన్ ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసి ఆ తరువాత ప్రభుత్వానికి సమర్పిస్తేనే అది కమిషన్ రిపోర్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాకాకుండా ముగ్గురు సభ్యులు వ్యక్తిగతంగా ఇచ్చిన నివేదికల ఆధారంగా రూపొందించిన బిల్లు, దాని ఆధారంగా అసెంబ్లీలో చేసే చట్టంపై న్యాయ వివాదాలు తలెత్తే అవకాశాలుంటాయని పేర్కొంటున్నారు. మరోపక్క 50 శాతం దాటి అదనంగా కల్పించే రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిఉంటుంది. ఇలా చేర్చడానికి సరైన కారణాలను చూపించాలి. ఒకవేళ అలాంటి సరైన కారణాలు లేకపోతే అది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్లో స్పష్టంచేసింది. కమిషన్ నివేదిక రాకుండానే సభ్యుల వ్యక్తిగత రిపోర్టులతో అసెంబ్లీలో చట్టం చేసినా వాటి ఆధారంగా 9వ షెడ్యూల్ చేర్చేందుకు మాత్రం వీలుండదని పేర్కొంటున్నారు. కమిషన్ నివేదిక లేకుండా బిల్లు పెట్టినా సాంకేతికంగా 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు వీలైన పరిస్థితులు లేక కాపు సామాజికవర్గానికి మళ్లీ అన్యాయమే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మంజునాథ్ ప్రకటనతో ఇరకాటంలో ప్రభుత్వం
ఇలా ఉండగా కమిషన్ రిపోర్టు అంటూ ప్రభుత్వం చెబుతున్న నివేదికలపై ఇప్పుడు మరో వివాదం తలెత్తింది. ప్రభుత్వానికి కమిషన్ నివేదికను అందించలేదని, త్వరలోనే దాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తామని బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్ శనివారం చేసిన ప్రకటన ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. సభ్యుల నివేదికలనే కమిషన్ రిపోర్టుగా పరిగణిస్తూ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇవ్వలేదని మంజునాథ్ పేర్కొనడం కాపులలో తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. కేవలం మభ్యపెట్టడానికి ప్రభుత్వం ఈ హడావుడిని సృష్టించిందా? కమిషన్ నివేదిక లేకుండా రూపొందించిన బిల్లు చెల్లుబాటు అవుతుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం కమిషన్ ఛైర్మన్‌తో సంబంధం లేకుండా సభ్యుల నుంచి వేర్వేరుగా నివేదికలు తీసుకున్నా అది కమిషన్ నివేదిక కిందకే వస్తుందని పేర్కొంటున్నాయి. ఒక కమిషన్‌ను వేశాక ఆ కమిషన్ ఏకమొత్తంగా, సమగ్రంగా అందించే నివేదిక మాత్రమే చెల్లుబాటు కిందకు వస్తుందని, సభ్యులు వేర్వేరుగా ఇస్తే అది వారి వ్యక్తిగతమే తప్ప కమిషన్ నివేదిక కిందకు రావని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అటు కాపు సామాజికవర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తే ప్రభుత్వానికి ఇరకాటంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment