
జగన్ దీక్షతోనైనా ప్రభుత్వం దిగిరావాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సాక్షి, ఒంగోలు: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షతోనైనా ప్రభుత్వం దిగొస్తుందని భావిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఒంగోలులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతగా జగన్‌కు నిరసన తెలియజేసే హక్కు ఉందన్నారు. నాలుగు రోజులు యోగాలో ఉండటం వల్ల ప్రభుత్వమంతా కోమాలోకి పోయిందని ఎద్దేవా చేశారు. యోగాకు తాము వ్యతిరేకం కాదని, అది వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు.
మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సేను ప్రజలు అసహ్యించుకుంటుంటే ప్రస్తుత ప్రభుత్వాలు విగ్రహాలు ప్రతిష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శివసేన, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు లౌకికవాదానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ సమగ్రతా దినోత్సవాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు.