కొత్త మంత్రులకు టీడీపీ నేతల షాక్
కొత్తగా మంత్రి పదవులు స్వీకరించిన కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌బాబులకు టీడీపీ నేతలే షాకిచ్చారు. కాల్వ శ్రీనివాసులు సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖల మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ కార్యక్రమానికి అసమ్మతి నేతలంతా గైర్హాజరయ్యారు. ఒక్క పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తప్ప మిగిలిన వాళ్లు అంతా డుమ్మాకొట్టారు. సొంత జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్, జేసీ ప్రభాకర్ రెడ్డి, బీకే పార్థసారథి, యామినీబాల, ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి... వీళ్లెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈసారి మంత్రి పదవుల కోసం పయ్యావుల కేశవ్, బీకే పార్థసారథి చిట్టచివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు గానీ ఫలితం లేకపోయింది. దాంతో అసమ్మతి వర్గీయులంతా కాల్వ బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు.
ఇక మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. ఐనవోలులో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రి నక్కా ఆనంద్‌బాబు వెళ్లారు. అయితే, ఆయనను స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వర్గీయులు అడ్డగించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించకుండా మంత్రి నేరుగా రావడం ఏంటని శ్రావణ్ మండిపడినట్లు తెలిసింది. ఆయన వర్గీయులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.