
పాలనను పూర్తిగా స్తంభింపచేస్తాం: ఏపీ ఎన్జీవోస్
సమైక్యాంధ్రకు మద్దతుగా నేటి అర్థరాత్రి నుంచి ప్రభుత్వ పాలనను పూర్తిగా స్తంభింప చేస్తామని ఏపీఎన్జీవోస్ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు.
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా నేటి అర్థరాత్రి నుంచి ప్రభుత్వ పాలనను పూర్తిగా స్తంభింప చేస్తామని ఏపీఎన్జీవోస్ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఆర్టీసీ నుంచి వీఆర్వో స్థాయి వరకు 4 లక్షల మంది సమ్మె చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అశోక్ బాబు డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనలకు ‘నిరవధిక సమ్మె’ తోడుకానుంది. నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీసీ మొదలుకొని రెవెన్యూ వరకు అన్ని సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ఏపీఎన్జీవోల నేతృత్వంలో దాదాపు 70 సంఘాలు సమ్మెకు సమాయత్తమయ్యాయి. రెవెన్యూ, ఎక్సైజ్, ట్రెజరీ, సహకార, వాణిజ్య పన్నులు, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్, మెడికల్, విద్యుత్ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు.
దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే సీమాంధ్ర, తెలంగాణ మధ్య రాకపోకలు అంతంత మాత్రంగా ఉండగా.. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో స్తంభించనుంది. గ్రామ సహాయకుల నుంచి తహశీల్దారు వరకు.. రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో దీని ప్రభావం గ్రామ స్థాయిలోనూ కనిపించనుంది.