మాకే దక్కాలి.. | AP releases sample list of ineligible pensioners | Sakshi
Sakshi News home page

మాకే దక్కాలి..

Published Sat, Nov 22 2014 2:01 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

AP releases sample list of ineligible pensioners

సాక్షి, రాజమండ్రి : ‘పింఛన్లు ఎక్కడ ఎలా ఇచ్చారన్నది కాదన్నయ్యా.. మనవాళ్లకు ఇస్తున్నారా లేదా అనేదే లెక్క’ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆధార్ కార్డుల్లో వయసు తక్కువగా నమోదై పింఛను కోల్పోయిన వారి కోసం జిల్లాలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో శుక్రవారం వయసు ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు చేయాల్సినవారి జాబితాను ముందుగానే వైద్యులకు అధికారులు పంపించారు. అధికార పార్టీవారే ఉండేలా ఈ జాబితాలు రూపొందించారు. వాటి ప్రకారం అభ్యర్థులను ఆస్పత్రులకు రప్పించి ధ్రువీకరణ చేయించారు. కేవలం ఆధార్‌లో తప్పుడు వయసు నమోదు కారణంగా పింఛను ఆగిపోతే నిజమా కాదో తెలుసుకునేందుకు తమను పిలవలేదేమిటని ముదుసలులు వాపోతున్నారు.
 
పింఛన్ల కోత తీరు ఇలా...
జిల్లాలో 2013 జూలై నాటికి అన్ని రకాల పింఛన్లూ కలిసి 4.75 లక్షలు ఉండేవి. ఎన్నికల వాగ్దానంలో భాగంగా టీడీపీ ప్రభుత్వం అక్టోబర్ రెండు నుంచి పింఛన్ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లబ్ధిదారుల జాబితాల పరిశీలన చేపట్టి, అనర్హుల పేరుతో సుమారు 1.04 లక్షల పింఛన్లు తొలగించింది. వీటిలో ఒక్క వృద్ధాప్య పింఛన్లే 40 వేలు పైగా ఉన్నాయి.

ఆధార్ కార్డు ఆధారంగా సర్వే చేయగా వీరందరూ బినామీలుగా తేలారని ప్రభుత్వం పేర్కొంది. కానీ వాస్తవానికి కారణాలు చెప్పకుండా కొందరికి, ఆధార్ కార్డుల్లో వయసు తప్పుగా ఉందని మరికొందరికి పింఛన్లు తొలగించారు. వయసు తప్పుగా నమోదై తొలగించిన వివిధ రకాల పింఛన్లు సుమారు 45 వేలు పైగా ఉన్నట్టు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. లబ్ధిదారుల ఆందోళనకు తలొగ్గిన జిల్లా అధికారులు ఆధార్‌లో వయసు తప్పుగా ఉన్నప్పటికీ వైద్య పరీక్షల ద్వారా వయసు నిర్ధారణ చేసి అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఆ ప్రకారం రాజమండ్రి వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రితో పాటు పెద్దాపురం, ప్రత్తిపాడు, వై.రామవరం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రామచంద్రపురం, తుని, అమలాపురం, రాజోలు, కొత్తపేట, అనపర్తి ఏరియా ఆస్పత్రుల్లో వృద్ధులకు వైద్యులు శాస్త్రీయ పద్ధతిలో వయసు నిర్ధారణ చేశారు.
 
ముందుగా ఇచ్చిన జాబితాల ప్రకారం..
ఈ పరిశీలనకు వైద్యులకు ముందుగా రూపొందించిన జాబితాలు అందజేశారు. వాటిలో పేర్లున్నవారు మాత్రమే వయసు పరిశీలకు అర్హులయ్యారు. అర్హులపేర్లు మాత్రం జాబితాల్లో లేవు. పెద్దాపురం, తుని, రామచంద్రపురం, అనపర్తి తదితర ప్రాంతాల్లో సుమారు 700 పైగా లబ్ధిదారులకు 65 ఏళ్లు పైబడి ఉన్నా, రెండు నెలల క్రితం వరకూ పింఛను పొందుతున్నా, వయసు తేడా పేరుతో వాటిని తొలగించారు.

ఇప్పుడు విషయం తెలుసుకున్న వీరంతా తమ ఆధార్ కార్డులు, వయసు ధ్రువపత్రాలు పట్టుకుని ఆస్పత్రులకు వెళ్లారు. కానీ, జాబితాలో వారి పేర్లు లేవని తిప్పి పంపేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. వైద్య పరిశీలనకు వెళ్లేవారి జాబితాలను గ్రామాలవారీగా టీడీపీ కార్యకర్తలే దగ్గరుండి తయారు చేయించారని తెలుస్తోంది. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న వార్డులు, డివిజన్లను వదిలి తమకు ప్రాతినిధ్యం లభించిన వార్డుల్లోనివారి పేర్లను జాబితాలో చేర్చారు. వ్యతిరేకుల పేర్లు జాబితాలకు ఎక్కకుండా చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement