ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తామంటూ ఆప్షన్ ఇచ్చిన తమకు ఇప్పటివరకు జూన్ నెల జీతం బ్యాంకులో జమ చేయకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సెక్రటేరియట్ ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తామంటూ ఆప్షన్ ఇచ్చిన తమకు ఇప్పటివరకు జూన్ నెల జీతం బ్యాంకులో జమ చేయకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వారందరూ గురువారం ధర్నాకు యత్నించడంతో ఏపీ సర్కారు సెక్రటేరియట్‌లో భారీగా పోలీసులను మోహరించింది. అయితే ఉద్యోగుల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ధర్నా యోచన వాయిదా వేసుకుని కార్యాలయాల దారి పట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన దాదాపు 300 మంది ఉద్యోగులు విభజన తర్వాత ఏపీ సెక్రటేరియట్‌లో పనిచేస్తామంటూ ఆప్షన్ ఇచ్చారు.
కానీ వారికి ఇప్పటివరకు జూన్ నెల వేతనాలు అందలేదు. పిల్లలను పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పించుకునే సమయంలో జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. సర్వీస్ రిజిస్టర్ ల ప్రకారం ఇంక్రిమెంట్లు కూడా వేయాల్సివుండగా అన్నిటికీ తిలోదకాలిచ్చి సహనాన్ని పరీక్షిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.