బోడో తీవ్రవాదుల నుంచి రాష్ట్ర ఇంజనీర్‌కు విముక్తి
చీరాల, న్యూస్‌లైన్: అసోంలో బోడో తీవ్రవాదులు బంధించిన రాష్ట్ర ఇంజనీర్ బత్తుల అంకమ్మరావు మంగళవారం విడుదలయ్యారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఆయన హైదరాబాద్‌కు చెందిన బొల్లినేని శీనయ్య నిర్మాణ సంస్థ తరపున అసోంలో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 22న బోడో తీవ్రవాదులు అంకమ్మరావును కిడ్నాప్ చేశారు. వెంటనే కంపెనీ ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలతో గాలించినా, ఆచూకీ లభించలేదు. అయితే, తొమ్మిది రోజులపాటు తమ చెరలో ఉంచుకున్న తీవ్రవాదులు అంకమ్మరావును మంగళవారం ఉదయం 4గంటల సమయంలో వదిలేశారు. అనంతరం అక్కడి సంస్థ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. తీవ్రవాదుల చెరలో ఉన్నప్పటి పరిస్థితిని వివరించారు.
‘‘డిసెంబర్ 22న సాయంత్రం విధులు ముగించుకుని వస్తున్న సమయంలో మాదర్‌పూర్ వద్ద ఆరుగురు బోడో తీవ్రవాదులు మా వాహనాన్ని ఆపారు. కళ్లకు గంతలు కట్టి ద్విచక్రవాహనంపై ఒక కిలోమీటర్ వరకు తీసుకెళ్లారు. తర్వాత మూడు గంటల పాటు అడవుల్లో నడిపించుకుని తీసుకెళ్లి ఒకచోట ఉంచారు. నాతో ఎవరూ మాట్లాడలేదు. వారంతా అర్థం కాని భాషలో వారే మాట్లాడుకుంటున్నారు. అందరి వద్దా ఆయుధాలున్నాయి. రోజూ రోటీలు, అన్నం పెట్టేవారు. స్నానం చేసేందుకు కూడా వీలు కల్పించారు. నాకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని వేడుకున్నాను. ఏమనుకున్నారో ఏమోగానీ మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో ఐఈ రివర్ బ్రిడ్జి వద్ద నన్ను వదిలి వెళ్లిపోయారు. దారి ఖర్చుల నిమిత్తం అరవై రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుతో ఆటో ద్వారా మా కంపెనీ వాహనం వెళ్లే చెప్పగుడి ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడ సంస్థ వాహనంలో హౌలీలోని కార్యాలయానికి చేరుకున్నాను. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కంపెనీ ప్రతినిధి భాస్కర్ నాతో మాట్లాడి మా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు’’ అని వివరించారు. అయితే, అంకమ్మరావుతోపాటు మరో ముగ్గురినీ బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసి.. అనంతరం వదిలివేసినట్లు సమాచారం.