మెజార్టీ ఉన్నా...టీడీపీలో వణుకు
► ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో అభద్రతా భావం
► అసంతృప్తితో చేజారుతారేమోనని భయపడుతున్న నాయకులు
► కలవరం సృష్టిస్తున్న మారుతున్న రాజకీయ పరిణామాలు
► వైఎస్సార్‌సీపీలో బొత్స చేరిక ప్రభావం చూపుతుందేమోనని తర్జనభర్జన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్థానిక సంస్థల్లో మెజార్టీ ఉన్నప్పటికీ టీడీపీలో ‘ఎమ్మెల్సీ’ వణుకు పుడుతోంది. ఏడాది కాలంలో ఏం చేయాలేకపోయామన్న అసంతృప్తితో స్థానిక సంస్థల ప్రతినిధులు ఎక్కడ చేజారిపోతారేమోనని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలు టీడీపీని మరింత డిఫెన్స్‌లో పడేశాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌సీపీలో చేరనుండటంతో కాంగ్రెస్ శ్రేణులతో పాటు టీడీపీలో ఉన్న ఆయన అనుయాయులు కూడా పార్టీ మారవ చ్చని, అదే జరిగితే తమకిఇబ్బంది తప్పదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని స్థానిక సంస్థల ప్రతినిధులు జారిపోకుండా ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ప్రత్యేక శిబిరం నిర్వహించే యోచనలో ఉన్నారు.
జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఇప్పటికే బలంగా ఉంది. చంద్రబాబు మోసపూరిత విధానాలు, హామీలు గాలికొదిలేయడం తదితర పరిణామాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారు. పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. రోజురోజుకీ పార్టీ బలోపేతమవుతుంది. దీంతో భవిష్యత్ వైఎస్సార్‌సీపీదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో ఉండి ఏం చేయలేకపోతామన్న బాధ కూడా టీడీపీ ప్రజాప్రతినిధుల్లో ఉంది. దీంతో కొందరు సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా వైఎస్సార్‌సీపీలో చేరనుండటంతో పార్టీకి మరింత బలం చేకూరనుంది. ఇదే టీడీపీని భయాందోళనకు గురి చేస్తోంది.
స్థానిక సంస్థల పరంగా మెజార్టీ బలం ఉన్నా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలోకి జంప్ చేసి,ఆ పార్టీ తరఫున స్థానిక సంస్థల్లో గెలిచి, అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకులు అనేక మంది వైఎస్సార్‌సీపీలో చేరవచ్చన్న అభిప్రాయం ఉంది. ఇక్కడికి సాధించేదేమి లేదని, గతంలో అండగా నిలిచిన నేతతో కలిసి పనిచేయడమే మేలన్న ఆలోచనలో కొందరు ఉన్నారు. ఇప్పటికే బొత్సతో సంప్రదింపులు చేసినట్టు కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే పార్టీ బలం తగ్గడమే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయేమోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్‌సీపీలో బొత్స చేరికపైనే టీడీపీ దృష్టి సారించింది. బుధవారం అశోక్ బంగ్లాలో జిల్లా ముఖ్య నేతల సమావేశంలో ఇదే విషయంపై చర్చించినట్టు తెలిసింది.
జాగ్రత్తగా ఉండాలన్న నిర్ణయానికొచ్చారు. ముందుగా నియోజవర్గాల వారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలన్న సందేశం పంపించాలని మంత్రి మృణాళిని, ఇతర కీలక నేతలు నియోజకవర్గ నాయకులకు సూచించినట్టు తెలిసింది. అవసరమైతే ప్రత్యేక శిబిరం నిర్వహించేందుకు సిద్ధమవ్వాలని శ్రేణులకు తెలిపినట్టు సమాచారం.అందులో భాగంగా గురువారం విజయనగరం నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులతో ఎమ్మెల్యే మీసాల గీత, ఐవీపీ రాజు, సైలా త్రినాథరావు, బొద్దుల నర్సింగరావు తదితరులు సమావేశమయ్యారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విషయాలపై చర్చించారు. ఇదే తరహాలో మిగతా నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు నిర్వహించేలా స్థానిక నేతలకు సమాచారం పంపించారు.