వలంటీర్ల నియామకాలపై సమీక్షిస్తున్న జెడ్పీ సీఈవో కైలాస గిరీశ్వర్
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : గ్రామ వలంటీర్ల నియామక ప్రక్రియ జోరందుకుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి తుది జాబితా సిద్ధం చేశారు. కీలకమైన ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష) ఘట్టం నేటి నుంచి మొదలు కానుంది. ఈనెల 11 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నాలుగు స్లాట్లలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 11,924 గ్రామ వలంటీర్ల ఉద్యోగాలకు మొత్తం 68,740 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే శ్రీకాకుళం నగరం, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 1704 వార్డు వలంటీర్ పోస్టులకు 4192మంది పోటీ పడుతున్నారు.
వీరిలో సామాజిక బాధ్యత, సేవా దృక్పథంలో ఆసక్తినే ప్రధాన అర్హతగా చూసుకుని, అర్హులను ఎంపిక చేసేందుకు అన్ని మం డలాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్డీలతో కూడి న త్రిసభ్య కమిటీని నియమించారు. అలాగే అన్ని మం డలాల్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఎస్.వాసుదేవరావు ఆధ్వర్యంలో ఏడుగురితో సెంట్రల్ మానిట రింగ్ కమిటీని నియమించారు. ఇందుకోసం జిల్లా పరిషత్ సీఈవో టి.కైలాస గిరీశ్వర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ల కు ఒక్కో వలంటీర్‌ను నియమించనున్నారు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు సంబంధించిన వివరాలతో ఒక కీ రిజిస్టర్ తయారు చేయాలని పంచాయతీరాజ్ కమిషన ర్ గిరిజాశంకర్ ఇప్పటికే ఎంపీడీవోలను ఆదేశించారు.
ఇంటర్వ్యూలు ఇలా....
ఇంటర్వ్యూ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగేలా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈవో టి.కైలాస్ గిరీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావులు తగు చర్యలు చేపట్టారు. ఈనెల 11వ తేదీన 2850 మందికి, 12న 6108, 13న 6108, 14న 6108, 15న 6050, 16న 6008, 17న 6008, 18న 6008, 19న 6008, 20న 5997, 21న 5715, 22న 4356, 23న 1416 మంది చొప్పున ప్రత్యేక స్లాట్ల ద్వారా మౌఖిక పరీక్షలను నిర్వహించనున్నారు. వీరికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తర్వాత 12 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే 2.30 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు స్లాట్ల కేటాయింపుల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈమేరకు జిల్లాలో 38 మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాలే వేదికలు కానున్నాయి. అభ్యర్థులకు ఆయా మండల పరిషత్ అధికారి, తహసీల్దార్, ఈవోపీఆర్డీల బృందమే ఇంటర్వ్యూ చేయనుంది.
ఇవి తప్పనిసరి
ఇక ఇంటర్వ్యూలకు హాజరుకానున్న అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వంటి ఐడెంటిటీ కార్డును వెంట తీసుకురావాల్సి ఉంది. అలాగే కేటాయించిన స్లాట్ సమయానికి అర్ధగంట సమయం ముందు ఇంటర్వ్యూ కేంద్రానికి రావాల్సిందేనని నిబంధన విధించారు. సాక్షరతా భారత్ వంటి ప్రాజెక్టుల్లో పనిచేసి, ఉద్యోగాలను కోల్పోయిన నిరుద్యోగులకు ఈ వలంటీర్ల పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎటువంటి సిఫారసు లెటర్లు, ఇతరత్రా ఒత్తిళ్లను అనుమతించేది లేదని, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగనుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎంపికైన వలంటీర్ల జాబితాను ఆగస్టు 1వ తేదీన అధికారులు ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment