ఎన్జీవోలపై హర్ష తనయుల దాడి
Published Sun, Oct 6 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
అమలాపురం ఎంపీ హర్షకుమార్ కుమారులు రాజమండ్రిలో సమైక్య ఉద్యమకారులపై దాడి చేయడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ దాడిని నిరసిస్తూ అమలాపురంలో ఎంపీ క్యాంప్ కార్యాలయాన్ని ఉద్యమకారులు ముట్టడించారు. ఆ సందర్భంగా జరిగిన పోలీసు లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. దాంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా హర్షకుమార్ కుమారుల చర్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మల దహనాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
సాక్షి, రాజమండ్రి/కంబాలచెరువు, న్యూస్‌లైన్ :
ఎంపీ హర్షకుమార్ తనయులు సమైక్యవాదులపై దాడి చేసి రెచ్చి పోయారు. ‘మీకు సమైక్యాంధ్ర కావాలా’ అంటూ వీరంగం ఆడారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ తోపులాట జరిగింది... ఆ పరిస్థితుల్లో కొట్టారని టీవీల్లో చెప్పడం ఉద్యమకారులను రెచ్చకొట్టింది.
దాడి జరిగిందిలా..
తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం పేపర్‌మిల్‌ను మూయించివేసేందుకు అక్కడకు వెళ్లిన ఎన్జీవో నాయకులు కాతేరు వైపునుంచి వచ్చే వాహనాలను ఆపేందుకు రాజీవ్‌గాంధీ కళాశాల వద్ద రోడ్డుకు అడ్డంగా ఆటోలు పెట్టి, తాడుతో దారి మూసివేస్తున్నారు. ఓ సమైక్యవాది ఉదయం 8.50 గంటల ప్రాంతంలో కళాశాల బోర్డును చింపారు. ఆ సమాచారం తెలుసుకున్న ఎంపీ హర్షకుమార్ తనయులు శ్రీరాజ్, సుందర్ అక్కడకు వచ్చి సమైక్యవాదుల చేతిలో జెండాలు లాక్కుని ఆ కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో సబ్‌కలెక్టర్ కార్యాలయం ఉద్యోగి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రమోద్‌కుమార్, వీఆర్వోలు లక్ష్మణ్, శివరాజు, పేపర్‌మిల్లు ఉద్యోగి దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.
పోలీసుల సాక్షిగా దాడి
‘ఏరా.. మీకు సమైక్యాంధ్ర కావాలా..మీరు ఎన్జీవోలా’ అంటూ పోలీసుల సాక్షిగా ఎంపీ తనయులు శ్రీరాజ్, సుందర్ దాడి చేశారు. వారికి ఎంపీ సెక్యూరిటీ, వారి వ్యక్తిగత గార్డులు తోడయ్యారు.
రంగంలోకి దిగిన ఎన్‌జీవోలు
పేపరు మిల్లు వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ఈ విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి, డీఎస్సీలు నామగిరి బాబ్జీ, అనిల్‌కుమార్ పోలీసులు బలగాలతో అక్కడకు చేరుకున్నారు. అలాగే అమలాపురం నుంచి కోనసీమ జేఏసీ నాయకులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. హర్షకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హర్షకుమార్ భార్య జేఏసీ నాయకులను బుజ్జగించే ప్రయత్నంలో కాలేజీ లోపల వారితో ఆమె మాట్లాడుతున్న సమయంలో ఆందోళకారులు బయటనుంచి రాళ్లు విసిరారు. ఈ దాడిలో కాలేజీ అద్దాలు బద్దలుకాగా ఒక పత్రికా విలేకరికి, మరొకరికి గాయాలయ్యాయి.
మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున చెత్తతీసుకుని వచ్చి కళాశాల ముందు వేశారు. ఆందోళనకారులు ఆ చెత్తకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను కళాశాల మెయిన్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకొనడంతో పక్కమార్గం గుండా లోపలికి వెళ్లి ఏసీ మిషన్లు తీసుకువచ్చి చెత్త మంటల్లో పడేశారు. మూడు కాలేజీ బస్సులను ధ్వంసం చేశారు. శ్రీరాజ్, సుందర్‌లను అరెస్టు చేశామని, కావాల్సివస్తే తీసుకెళ్లి చూపిస్తామని ఎన్జీవో నాయకులు గెద్దాడ హరిబాబు, ఇతర జేఏసీ నాయకులకు ఎస్పీ వివరించడంతో గొడవ
సద్దుమణిగింది.
బాధితులకు పరామర్శ
ఎంపీ తనయుల దాడిలో గాయపడిన ప్రమోద్‌కుమార్, లక్ష్మణ్, శివరాజ్, దుర్గాప్రసాద్‌లను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పరామర్శించారు.
నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి
మాకు క్షమాపణలు కాదు. న్యాయం కావాలి. ఎంపీ కుమారులపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేయాలి.
- బూర్ల హరిబాబు, ఎపీఎన్‌జీఓల సంఘం
రాజమండ్రి విభాగం అధ్యక్షుడు
సమైక్యవాదుల్ని నీచంగా తిట్టారు
సమైక్యవాదాన్ని, ఉద్యోగులను ఎంపీ తనయులు నీచంగా తిట్టారు. మేంప్రాణాలకు ఒడ్డి సమైక్య రాష్ట్రం కోసం పాటు పడుతుంటే సీమాంధ్రలో ఉండి తెలంగాణా వాదిలా వ్యవహరించారు.
- ప్రమోద్ కుమార్, దాడిలో గాయపడ్డ ఉద్యోగి
వారు ఎన్‌జీవోలని తెలీదు
ఏపీఎన్‌జీవోల పిలుపులో కళాశాలల బంద్ లేదు. అయినప్పటికీ మేం బంద్ పాటిస్తున్నాం. కళాశాలపై దాడి చేస్తున్నారని భావించి కొట్టాం. వారు ఎన్‌జీవోలు అని తెలియదు. - సుందర్, హర్షకుమార్ కుమారుడు
Advertisement
Advertisement