సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సు నడుపుతున్న డ్రైవర్ (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపే వారెందరో ఉన్నారు. ఫలితంగా ప్రమాదాలకు కారణమవుతున్న వారూ ఉన్నారు. ఇలా పలు సందర్భాల్లో నడిపే వారితో పాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. ఇలాంటి వాటిని ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతోంది. బస్సు నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడడాన్ని పూర్తిగా నిషేధించింది. ఎవరూ చూడడం లేదని, ఫిర్యాదు చేసినా ఏమీ కాదనుకుని బస్ నడిపే సమయంలో ఫోన్‌లో మాట్లాడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందుకోసం జీపీఎస్ లైవ్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. ఎవరైనా ఆర్టీసీ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో మాట్లాడితే ఫిర్యాదు చేయడానికి విజయవాడలో సెంట్రల్ కంప్లయింట్ సెల్ (0866–2570005)ను ఏర్పాటు చేసింది. అలా మాట్లాడుతున్న ఫొటో లేదా వీడియోను ఆధారంగా జతపరచాల్సి ఉంటుంది.
ఫిర్యాదు అందుకున్న అనంతరం ఆ బస్ జీపీఎస్ లైవ్ ట్రాకింగ్‌ను, సంబంధిత డ్రైవర్ ఫోన్ నంబరును, కాల్‌డేటాను పరిశీలిస్తారు. ఆ డ్రైవరు బస్ నడుపుతూ ఫోన్‌లో మాట్లాడిందీ లేనిదీ నిర్థారణకు వస్తారు. తాను డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడలేదని బుకాయించినా జీపీఎస్ లైవ్ ట్రాకింగ్, కాల్‌డేటా ఆధారంగా చర్యలు చేపడతారు. ‘కొన్నాళ్ల క్రితం ఇలానే ఓ అమరావతి సర్వీసు డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సు నడిపాడు. ఆ విషయాన్ని ఓ ప్రయాణికుడు సెంట్రల్ కంప్లయింట్ సెల్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ డ్రైవర్‌ని అడిగితే తాను మాట్లాడలేదని చెప్పాడు. మేం అతని కాల్‌డేటాను పరిశీలిస్తే 9 నిమిషాల సేపు మాట్లాడి 13 కిలోమీటర్లు నడిపినట్టు తేలింది. దీంతో ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాం’ అని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు బుధవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. రాష్ట్రంలోని 12 వేల ఆర్టీసీ బస్సులకూ జీపీఎస్ లైవ్ ట్రాకింగ్ సిస్టం అమలు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు విశాఖ రీజియన్‌లో డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడిన కేసు ఒకటి నమోదైంది. విశాఖ – శ్రీకాకుళం అద్దె బస్సు డ్రైవర్‌పై ఈ ఫిర్యాదు అందింది. విచారించిన అధికారులు ఆ ఫిర్యాదులో వాస్తవం లేదని తేల్చారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల తలెత్తే ప్రమాదాలతో పాటు సంస్థ వారిపై తీసుకునే చర్యలను ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ప్రతి మంగళవారం కూడా వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment