ఆర్టీసీ బాదుడుకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాణికులపై ఆర్టీసీ బస్సు చార్జీల భారం పడనుంది. ఈ మేరకు బస్సు చార్జీల పెంపుదలకు రంగం సిద్ధమైంది. 20 శాతం మేరకు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల్ని ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు రెండ్రోజుల క్రితం సచివాలయంలో రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావును కలసి అందజేశారు.
జూన్ మొదటి వారంలో ‘నవనిర్మాణ దీక్ష’ పేరిట ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున.. అవి పూర్తయిన వెంటనే ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు నిర్ణయించారు. తొలుత తెలంగాణలో బస్సుచార్జీలను పెంచిన తర్వాత ఏపీలోనూ పెంచాలని భావించారు. అయితే ఆర్టీసీ ఆస్తుల విభజన మరో మూడు నెలలు వాయిదా పడటం, పరిపాలనపరంగా ఎప్పటి నుంచి వేర్వేరుగా పాలన జరుగుతుందో స్పష్టత లేకపోవడంతో మొత్తమ్మీద వీలైనంత త్వరగా బస్సుచార్జీలను పెంచేందుకు నిర్ణయించారు. జూన్ 2 నుంచి 8 వరకు నవ నిర్మాణ దీక్షలు, ఈ మధ్యలో జన్మభూమి-మా ఊరు గ్రామసభలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన వెంటనే పల్లె వెలుగు బస్సుల నుంచి గరుడ ప్లస్, వెన్నెల బస్సుల వరకు అన్నింటికీ చార్జీల పెంపు వర్తించేలా ప్రతిపాదనలు రూపొందాయి. రెండేళ్లుగా బస్సుచార్జీలు పెంచలేదని, కాబట్టి తప్పక పెంచాలని సూచిస్తూ సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనల్లో పేర్కొంది. బస్సు చార్జీల పెంపుతో రాష్ట్రంలోని ప్రయాణికులపై రూ.830 కోట్లకుపైగా భారం పడనుందని అంచనా.