
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఆశా వర్కర్లతో కలసి పర్యటిస్తున్న మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి ఎవరూ భయపడవద్దని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని ధైర్యం చెప్పారు.
సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లి వచ్చిన వారు.. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వాళ్లు.. వీరితో సన్నిహితంగా మెలిగిన వాళ్లు.. కరోనా వైరస్ అనుమానితులు.. ఇలా గత కొన్ని రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు ఎంతో ఊరట కల్పిస్తున్నారు. వారికి నిత్యం ధైర్యం చెబుతూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రతిరోజూ వారి ఇంటికే వెళ్లి పలకరిస్తున్న తీరు బాధితులకు కొండంత భరోసానిస్తోంది.
వీరు ఇంటింటికీ వెళ్లి ఏం చేస్తున్నారంటే..
► ఉదయం 8 గంటల నుంచి ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి భౌతిక దూరం పాటిస్తూ వారిని పేరుపేరునా పలకరిస్తారు.
► అమ్మా బాగున్నారా.. అయ్యా బాగున్నారా.. దగ్గు జలుబు ఏమైనా ఉన్నాయా అంటూ వివరాలు సేకరిస్తున్నారు.
► దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు ఉంటే తెలుసుకోవడం, ఆ లక్షణాలున్న వారి పేర్లు నమోదు చేసుకుని పీహెచ్‌సీ డాక్టరుకు సమాచారమిస్తారు.
► చిన్నచిన్న వ్యాధులకైతే ఏఎన్‌ఎంలే మందులు అందజేస్తారు.
► విదేశీ ప్రయాణీకులకు సంబంధించి రోజూ 29 వేల ఇళ్లకు వెళ్లి వాకబు చేస్తున్నారు.
► మరో 2500 ఇళ్లకు పైగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి తరఫు బంధువుల ఇళ్లకు వెళ్లి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
► ఇలా రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది ఆశా కార్యకర్తలు, మరో 15వేల మంది ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారు.
► వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది వీరికి అదనం.
నేటి సాయంత్రానికి గణన పూర్తి
రాష్ట్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి గణన నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రానికల్లా వయసుల వారీగా అందరి వివరాలు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు సేకరిస్తారు. మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక రోగాలున్న వారి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అలాగే, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా 108, 104కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.