ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకోసారి నిర్వహించే బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి ఈరోజు (శనివారం) సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. అనంతరం 12 నుంచి 16వ తేదీ వరకు బాలాలయ మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ సందర్భంగా వైకుంఠ నాథుడైన శ్రీవారి ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ వరకు అన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తారు.
మహాసంప్రోక్షణ కార్యక్రమం నేపథ్యంలో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. నేటి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
దర్శన వేళలు..
- ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు..
- తిరిగి ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
- రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు..
- రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు.
మొత్తం 14 గంటల్లో సుమారు 50 వేల మంది దర్శనం చేసుకుంటారని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 17 నుంచి శ్రీవారి సేవలు యథావిధిగా మొదలౌతాయని పేర్కొన్నారు. మహాసంప్రోక్షణ కారణంగా భక్తుల రద్దీ తగ్గిందని అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు. కాగా, తిరుమలలో వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment