
కానిస్టేబుళ్లకు వేధింపులు
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్, రాత్రింబవళ్లు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే యాంటి నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్‌ఎస్) కానిస్టేబుళ్లు వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌ఐ(రిజర్‌వ ఇన్‌స్పెక్టర్) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వారం తా విలవిలలాడుతున్నారు. తన సొంత పనులు చేసిపెట్టేవారికే ప్రాధాన్యమిస్తూ మిగిలిన వారిని వేధింపులకు గురిచేస్తున్నాడని ఏఎన్‌ఎస్ ఆర్‌ఐ సంకురయ్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
వేధింపులు ఇలా.: సంకురయ్య రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు రూరల్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ప్రకాశం జిల్లాలో కానిస్టేబుళ్ళను వేధింపులకు గురిచేయడం, ఇష్టానుసారంగా వ్యవహరించినందునే గుం టూరుకు బదిలీ చేసినట్లు విమర్శలున్నాయి. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో 190మంది కానిస్టేబుళ్లు ఏఎన్‌ఎస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. సంకురయ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని వారంతా వాపోతున్నారు.
నెల రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ తన తండ్రి చనిపోయాడని వార్త రావడంతో ఆర్‌ఐ వద్దకు వెళ్లి సెలవు కావాలని కోరగా, సెలవు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. చివరికి ఆ కానిస్టేబుల్ ఓఎస్‌డీ వెంకటయ్యను కలిసి సమస్య వివరించడంతో పది రోజుల సెలవు ఇచ్చారు. పల్నాడు ప్రాంతంలో మావోయిస్టుల సమాచారం అందించినా వాస్తవం కాదంటూ కొట్టిపారేస్తున్నాడని కానిస్టేబుళ్లు వాపోతున్నారు.
ఆయన ఆగడాలను ఎస్పీ జె.సత్యనారాయణకు వివరించేందుకు ముగ్గురు కానిస్టేబుళ్లు వెళ్ళగా విషయం తెలుసుకున్న ఆర్‌ఐ వారిని పిలిపించి తీవ్రంగా మందలించడంతోపాటు మెమోలుజారీ చేసినట్లు తెలిసింది. ఓఎస్డీ ఆదేశాలను సైతం బేఖాతరు చూస్తూ... కానిస్టేబుళ్లకు సొంతపనులు అప్పగించడం, చేయనివారిని వేధింపులకు గురిచేయడం, చార్జిమెమోలు జారీ చేయడం పరిపాటిగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నా దృష్టికి రాలేదు : ఓఎస్డీ
సిబ్బందిని ఆర్‌ఐ వేధిస్తున్నట్టు తన దృష్టికి రాలేదని ఓఎస్డీ వెంకటయ్య న్యూస్‌లైన్‌కు చెప్పారు. వాస్తవమని విచారణలో తేలితే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎన్‌ఎస్ విభాగంలో ఎవరికి సెలవులు అవసరమైనా వెంటనే మంజూరు చేయాలని ఆర్‌ఎస్‌ఐ, ఆర్‌ఐలను ఆదేశించానని తెలిపారు. ఆర్‌ఐ తీరుపై దృష్టి సారించామన్నారు.