
8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల
అమలాపురం : శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమవుతాయని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సమావేశాలు నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో నిర్వహించాలనుకున్నామని,
కేంద్రం జీఎస్‌టీ బిల్లును వచ్చే నెల 8 నాటికి ఆమోదించి పంపాల్సిందిగా కోరడంతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామన్నారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలు చర్చించాలనేది తొలి రోజున బీఏసీ సమావేశం నిర్వహించి ప్రకటిస్తామని చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి చైర్మన్‌గా ఉన్న హైపర్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ నెల 30న న్యూఢిల్లీలో సమావేశమై జీఎస్‌టీ పరిహారం కేటాయింపులపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.