
‘ధర్నా’పై దాడులు
ప్రజావ్యతిరేక పాలనపై నేడు వైఎస్సార్‌సీపీ మహాధర్నా
ధర్నాలను అడ్డుకునేందుకు దాడులకు తెగబడిన టీడీపీ
నేతలను అరెస్టు చేసి నిర్బంధిస్తున్న పోలీసులు
కృష్ణాలో పార్థసారథిపై రాళ్లు, ఆయన్నే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పశ్చిమలో కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్టు
విశాఖలో జగన్ ధర్నాను అడ్డుకునేందుకు భారీగా పోలీసుల మోహరింపు.. అన్ని జిల్లాల్లోనూ వాహనాలను అడ్డుకోవాలని పోలీసులకు మౌఖిక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వంపై నిరసన గళం విప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రధానంగా అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోకపోవడం, బాబు వస్తే జాబు వస్తుందని, లేదంటేనిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న హామీ నిలబెట్టుకోకపోవడంపై ఆ పార్టీ సమరశంఖం పూరించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా విశాఖపట్టణం కేంద్రంగా నిర్వహించే మహాధర్నా కార్యక్రమంలో పాల్గొంటుండగా, అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పార్టీ శ్రేణులు సంసిద్ధమయ్యాయి.
ఈ మహాధర్నా ఆందోళన కార్యక్రమాలను అడ్డుకునేందుకు టీడీపీ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కలెక్టరేట్లకు వచ్చే వాహనాలను అడ్డుకుని జనాన్ని దించేయాలని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలు రుణమాఫీ నెరవేరిందంటూ సంబరాలు చేసుకుని కవ్వింపులకు దిగారు. కొన్నిచోట్ల బరితెగించి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు దిగారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికారపార్టీకే వంతపాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టులు చేస్తుండడంతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా జిల్లా పోరంకిలో వైఎస్సార్‌సీపీ ధర్నాకు సంబంధించిన బ్యానర్‌ను టీడీపీ నాయకులు పీకేసి దగ్ధం చేశారు.
ఆ బ్యానర్ స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ భారత్ బ్యానర్‌ను కట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి కే పార్థసారథి, ఇతర నాయకులు ఆందోళనకు దిగగా... టీడీపీ నాయకులు ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం కాగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమయంలోనే టీడీపీకి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడికి వచ్చి వైఎస్సార్‌సీపీ నేతలను దూషించారు.
దీన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైసీపీ నాయకులను మీడియాతో మాట్లాడనీయకుండా అదుపులోకి తీసుకుని వ్యానుల్లోకి ఎక్కించి కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్నాకు కార్యకర్తలను తీసుకెళ్లేందుకు బస్సులు ఇస్తామని చెప్పిన ఆర్టీసీ చివరి నిమిషంలో ఇవ్వకుండా అడ్డం తిరగడంతో ఆయన డిపో ఎదుట ధర్నా చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
విశాఖలో భారీగా పోలీసుల మోహరింపు
వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్న నేపథ్యంలో ప్రజలనుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ధర్నాలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం 8గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఈ ధర్నా కోసం ఇప్పటికే జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోనూ పార్టీ నిర్వహించిన సన్నాహక సమావేశాలకు కార్యకర్తలతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. రుణమాఫీ అమలు, హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంపై మండిపడుతున్నారు.
తమ కోసం వై.ఎస్.జగన్ గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు భారీగా తరలివస్తామని స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం నగరంతోపాటు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా భారీగా ప్రజలు తరలిరానున్నారని నిఘావర్గాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. వై.ఎస్.జగన్ పాల్గొననున్న ఈ ధర్నా విజయవంతమైతే తమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం అడ్డుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. విశాఖతోపాటు ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో ధర్నాకు వచ్చేవారిని అడ్డుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలందినట్లు తెలిసింది. ‘నేవీ డే’ ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా ఈ విషయంపై మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఉన్నట్టుండి రెండు వేలమంది పోలీసులను నగరమంతా మోహరించారు.
మరోవైపు విశాఖపట్నంలో ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, ఇతరత్రా కార్యక్రమాలను నిషేధిస్తూ యాక్ట్ 30ను విధించింది. ఈమేరకు డిసెంబర్ 1వ తేదీతో విడుదల చేసినట్లుగా గురువారం రాత్రి (డిసెంబర్ 4న) ఓ ప్రకటన జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి 31వరకు ఈ నిషేధాజ్ఞలు అమలో ఉంటాయని పేర్కొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నందున కలెక్టరేట్, జిల్లా పరిషత్తు, ఆంధ్రా విశ్వవిద్యాలయం, జీవీఎంసీ, బీచ్‌రోడ్ తదితర ప్రాంతాల్లో ఈ నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని చెప్పింది. ఇంత హడావుడిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించే ధర్నాకు ఒక రోజు ముందే హడావుడిగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
ప్రభుత్వ కుట్రను తిప్పికొడతాం
ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రభుత్వ కుట్రను అడ్డుకుంటామని తేల్చిచెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ రాష్ట్ర పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం స్పష్టం చేశారు. పోలీసు బలం, అధికార జులుంతో ప్రజాబలాన్ని అణచివేయలేరని చెప్పారు. పార్టీ నేతుల, కార్యకర్తలు, ప్రజలు విరివిగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు.