
వదినపై లైంగిక దాడికి యత్నం
అన్న భార్య తల్లితో సమానం అంటారు. కానీ ఆ కామాంధుడు సొంత వదినపైనే లైంగిక దాడికి యత్నించాడు. ఆమె అంగీకరించకపోవడంతో దాడికి తెగబడ్డాడు. పిల్లలను సైతం హతమారుస్తానని బెదిరించాడు. తన మరిది, బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు హరేంద్ర కుమార్ గురువారం లైంగిక దాడికి ప్రయత్నించాడని, అంగీకరించకపోవడంతో దాడి చేశాడని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త పొట్టకూటి కోసం చెన్నై వెళ్లడంతో ఈ అఘాయ్యితానికి ఒడిగట్టాడని వివరించింది.
కొద్దిరోజుల నుంచి కోర్కె తీర్చాలంటూ వేధిస్తున్నాడని, పలుమార్లు మందలించినా బుద్ధి మార్చుకోలేదని విలపించింది. కోర్కె తీర్చకుంటే పిల్లలను చంపుతానని బెదిరిస్తూ తన మెడ, గుండెపై రక్కాడని పేర్కొంది. రక్షణ కల్పించాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కుమార్ చెప్పారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాడి..
గురువారం రాత్రి పిల్లలతో పోలీసుస్టేషన్ వద్ద ఉన్న ఆమెపై.. హరేంద్రకుమార్ దాడికి తెగబడ్డాడు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇంటికి వెళ్లాక తనతోపాటు పిల్లలపై కూడా దాడికి తెగబడే ప్రమాదముందని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.