కురుపాం, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని శోభలతాదేవి కాలనీ సమీపంలో ఆదివారం ఓ ఆటో బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఐ.చంద్రశేఖర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు... కురుపాంలోని కేఎన్‌బీ తోటలో ఆదివారం వైశ్యసంఘం వన భోజన కార్యక్రమం నిర్వహించారు. శివ్వన్నపేటకు చెందిన చంద్రశేఖర్ ఈ వన భోజనానికి హాజరై తిరిగి తన ద్విచక్ర వాహనంపై కురుపాం వస్తుండగా... శోభలతాదేవి కాలనీ సమీపంలో కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం వైపు వేగంగా వెళుతున్న ఆటో బైక్‌ను ఢీకొంది. దీంతో చంద్రశేఖర్ తలకు గాయమైంది. అలాగే కుడిచేయి విరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా వైద్యాధికారి కె.మనోజ్‌కుమార్ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తరలించారు. ఈ మేరకు కురుపాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.