ఏలూరు ఆటోనగర్‌లోని స్థలాల కేటాయింపులో చోటుచేసుకున్న అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ‘
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు ఆటోనగర్‌లోని స్థలాల కేటాయింపులో చోటుచేసుకున్న అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ‘పెద్దలే గద్దలు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. బుధవారం కలెక్టరేట్‌లో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆటోనగర్ స్థలాలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు ఉంటే రద్దు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలోనూ విచారణ
ఏడాది క్రితం అప్పటి కలెక్టర్ సిద్థార్థజైన్ ఆటోనగర్ అసోసియేషన్ అక్రమాలపై ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, జిల్లా రిజిస్ట్రార్, కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా సహకార శాఖ అధికారి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంతోపాటు సభ్యులను విచారించి అసోసియేషన్‌లో అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. సభ్యులందరికీ న్యాయం జరగాలంటే ఏం చేయాలనే దానిపై మార్గదర్శకాలు రూపొందించింది. సిద్ధార్థజైన్ ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత ఈ రెండు మూడు నెలల్లో మాగంటి నాగభూషణం హడావుడిగా స్థలాల రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. తాజాగా కలెక్టర్ కె.భాస్కర్ చేపట్టే సమగ్ర విచారణతో ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి.
ఎస్పీ సీరియస్
ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంపై ఒకటి రెండు రోజుల్లో కేసు నమోదు చేస్తామని ఎస్పీ డాక్టర్ కె.రఘురామ్‌రెడ్డి తెలిపారు. ‘పెద్దలే గద్దలు’ కథనంపై ఆయ న స్పందిస్తూ.. ఆటోనగర్ స్థలాలను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్న మాగంటి నాగభూషణంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. విచారణ క్రమంలో ఏపీఐఐసీ అధికారులకు సమాచారమిచ్చామని, ఇంతవరకు సమాధానం రాలేదని తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంలోని వివరాలు, తమకు అందిన ఫిర్యాదుల్లోని తీవ్రత ఆధారంగా మాగంటిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు