సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు కేటాయింపులు.. భూ కుంభకోణాల గుట్టువిప్పుతాం... అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తాం.. ఇందు కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం.. గత పాలకుల భూ కుంభకోణాల వల్ల జిల్లాకు చెడ్డ పేరు వచ్చింది.. దాన్ని రూపు మాపి జిల్లాను అగ్రపథాన నిలపడానికి మీరు...మేము కలసి పని చేద్దామని అధికారులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిద్దామని చెప్పారు. స్థానిక గవర్నర్ బంగ్లాలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో శనివారం పలు ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ గతంలో జరిగిన పనులు, కేటాంపుల్లో అవకతవకలు ఉంటే వెలుగులోకి తేవాలని ఆదేశించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సమష్టిగా పని చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేద్దా మన్నారు. ఈ క్రమంలో బాగా పని చేసిన అధికారులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో సన్మానం చేయిస్తానని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీటి, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్తు సరఫరా తదితర వసతులను మెరుగుపర్చాలని ఆదేశించారు.
ఎన్‌ఏడీ ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి
ఎన్‌ఏడీ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, ఆ జంక్షన్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్డు నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖ సమన్వయంతో పనిచేస్తూ పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పర్యాటకులకు దివ్యదామంగా విశాఖను తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రాన్నికి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు వీసా ఆన్ ఎరైవల్ విధానాన్ని అములు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక అంబాసిడర్‌ను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 2న0న ఎమ్మెల్యేలతో కలిసి శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ప్రత్యేకంగా జీవిఎంసీ ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించేందుకు 21న సమావేశం నిర్వహిస్తాననని మంత్రి చెప్పారు.
భీమిలి నియోజకవర్గంపై సమీక్ష
భీమిలి బీచ్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి పనులను ప్రారంభించాలని సూచించారు.మత్స్యకారుల రక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై దృష్టిసారంచాలని, అందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని సూచించారు.చిట్లివలస శ్మశానవాటిక అభివృద్ధికి గతంలో మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం అయినట్టు ఆరోపణలు ఉన్నాయని.. దానిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోస్తనీనదిపై కాజ్‌వే నిర్మాణానికి ప్రతిపాదించిన పనులను వేగవంతం చేసి జూలై 15 నాటికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈను ఆదేశించారు.
అదేవిధంగా మధురవాడ, పరదేశిపాలెం బోయిపాలెం తదితర ప్రాంతాల్లో భవన సముదాయాల నిర్మాణానికి నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని జీవిఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్–1 పరిధిలోని పలు వార్డుల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చాలని జీవీఎంసీ అధికారులకు మంత్రి సూచించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర నివేదిక అందజేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. నివాసయోగ్యమైన భవన సముదాయాల్లో ప్రైవేటు పాఠశాలల ఏర్పాటును ఎలా అనుమతిస్తారని, ఆయా పాఠశాలను వెంటనే అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.వనయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్ ఎం. హరినారాయణన్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ బసంత్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాస్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment