
సాక్షి, విశాఖపట్టణం : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో భీమిలి, విశాఖ, అరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది పర్యాటకం ద్వారా రూ. 50 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. విశాఖతో పాటు పలు పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. మరోవైపు టీడీపీ హయాంలో అటవీ శాఖ భూములు కూడా కబ్జా చేశారని విమర్శించారు. భూకుంభకోణాలపై ఎవ్వరినీ ఉపేక్షించలేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు పంపిణీ చేయడానికి రూ. 30 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశామని తెలిపారు. గురువారం గురజాడ కళాక్షేత్రంలో 50 వేల మందికి రూ. పదివేల చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు.