ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నగరంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత కలెక్టరేట్ వద్ద ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ విజయకుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం చర్చి సెంటర్ వద్ద మానవహారం నిర్మించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ భావితరాలు హెచ్‌ఐవీ బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రించగలమన్నారు. అనంతరం ర్యాలీ రిమ్స్ వైద్యశాల నుంచి అంబేద్కర్ భవన్‌కు చేరుకుంది. ర్యాలీలో జిల్లా వైద్యాధికారి రామతులశమ్మ, ఎయిడ్స్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ వాణిశ్రీ, ప్రాజెక్టు మేనేజర్ రంగారావు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ నియంత్రణలో భాగస్వాములవుదాం
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వీ మోహన్‌కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం, యువత సమష్టిగా కృషి చేస్తేనే భవిష్యత్తు తరాలను ఎయిడ్స్ నుంచి కాపాడగలమన్నారు. హెచ్‌ఐవీ బాధితులకు తమ సంస్థ తరఫున న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. జిల్లా వైద్యాధికారి రామతులశమ్మ మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలని కోరారు. కుష్టు, ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ టీ వాణిశ్రీ మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను వివరించారు. ఎయిడ్స్ డీపీఎం టీ రంగారావు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఎయిడ్స్ కేసులు 3.04 శాతం నుంచి 2.55 శాతం తగ్గాయని తెలిపారు. గర్భిణుల్లో హెచ్‌ఐవీ వ్యాప్తి 0.23 శాతం నుంచి 0.18 శాతం తగ్గిందన్నారు. హెచ్‌ఐవీ బాధితులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో 200 మందికి పౌష్టికాహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యవిధాన పరిషత్ కో-ఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రమేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ విద్యావతి, డాక్టర్ వీ నాగరాజ్యలక్ష్మి, పీపీఎన్ ప్రెసిడెంట్ నరేంద్ర, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
అవగాహనతో ఎయిడ్స్ నియంత్రణ
Published Mon, Dec 2 2013 2:08 AM | Last Updated on Mon, Oct 8 2018 5:23 PM
Advertisement
Advertisement