హారిక.. బ్యాడ్మింటన్‌ ఆశా దీపిక | badminton Harika Special Story | Sakshi
Sakshi News home page

హారిక.. బ్యాడ్మింటన్‌ ఆశా దీపిక

Jul 30 2018 6:36 AM | Updated on Jul 30 2018 6:36 AM

badminton Harika Special Story - Sakshi

ఘనాలో భారత్‌ తరఫున ఆడి రెండు బంగారు పతకాలు సాధించిన హారిక, తల్లిదండ్రులతో..

పశ్చిమగోదావరి, తణుకు అర్బన్‌: ఓనమాలు దిద్దే వయసులో నాన్న చేతి నుంచి అందుకున్న బ్యాడ్మింటన్‌ రాకెట్‌ నేడు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఆమే తణుకుకు చెందిన వెలుదుర్తి శ్రీనివాస్, చిన కృష్ణవేణి దంపతుల కుమార్తె హారిక. ఎనిమిదో ఏటే షటిల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ బాట పట్టిన ఆమె అంచనాలను మించి అంతర్జాతీయస్థాయిలో భారతదేశం తరఫున ఆడుతూ గోల్డ్‌ మెడల్స్‌ సాధిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతోంది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే ఆట తీరు హారిక సొంతం. కోర్టులో చురుగ్గా కదులుతూ హారిక కొడుతున్న షాట్లకు టాప్‌ టెన్‌ క్రీడాకారులు సైతం కంగుతింటున్నారు.

వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 86వ స్థానం
తాజాగా ప్రకటించిన వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 106వ ర్యాంక్‌ నుంచి ఒకేసారి 86వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఆల్‌ ఇండియా సీనియర్స్‌ ర్యాంకింగ్స్‌ మిక్స్‌డ్‌ విభాగంలో 1వ స్థానం, డబుల్స్‌ విభాగంలో 4వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మెడల్‌ సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది. అండర్‌–13, 14 అనంతరం 2014లో అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టి రోజురోజుకు ర్యాంకింగ్‌ మెరుగుపర్చుకుంటోంది. ప్రస్తుతం ముంబాయిలోని థానే బ్యాడ్మింటన్‌ అకాడమీ కోచ్‌ ఎంఎన్‌ శ్రీకాంత్‌ వాడ్‌ శిక్షణలో రాటుదేలుతోంది. ఇప్పటివరకు వివిధ విభాగాల్లో మొత్తం 50 మెడల్స్‌పైగా సాధించగా అందులో 22 గోల్డ్‌ మెడల్స్‌ ఉండడం విశేషం. చైనీస్‌ తైపీ, యూరోప్, ఉక్రెయిన్, నేపాల్, అతుల్, నైజీరియా దేశాల్లో పలు మెడల్స్‌ సాధించింది. తాజాగా ఈ నెలలో ఆఫ్రికాలోని çఘనాలో జరిగిన çఘనా ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్, ఉమెన్‌ డబుల్స్‌ విభాగాల్లోను గోల్డ్‌ మెడల్స్‌ సాధించి సత్తా చాటింది.

తల్లిదండ్రులూ క్రీడాకారులే..
తండ్రి వెలుదుర్తి శ్రీనివాస్‌ చిన్ననాటి నుంచి షటిల్‌ బ్యాడ్మింటన్, క్రికెట్‌ తదితర క్రీడల్లో ప్రావీణ్యత సాధించారు. షటిల్‌లో యూనివర్సిటీ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించారు. 2006 నుంచి 2012 వరకు షటిల్‌ టోర్నమెంట్‌ అంపైర్‌గా కూడా వ్యవహరించారు. హారిక చిన్ననాటి నుంచి తండ్రితో పాటు తణుకులోని ఆఫీసర్స్‌ క్లబ్‌లోని షటిల్‌ కోర్టుకు వెళ్లి ప్రాక్టీస్‌ చేసేది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌ కేబుల్‌ ఆపరేటర్‌గా జీవనం సాగిస్తుండగా, తల్లి కృష్ణవేణి గృహిణి. ఆమె కూడా వాలీబాల్‌ క్రీడాకారిణి కావడంతో హారికకు ఎంతో ప్రోత్సాహం దక్కింది. హారిక సోదరి పావని శృతి ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతోంది.

2012లో కాలుకు గాయం..
2012లో షటిల్‌ ఆడుతుండగా కాలుకు గాయం కావడంతో మోకాలికి హైదరాబాద్‌లో మేజర్‌ ఆపరేషన్‌ చేశారు. తిరిగి 2014 నుంచి బ్యాడ్మింటన్‌ కోర్టులో అడుగుపెట్టినప్పటికీ ప్రస్తుతం డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో మాత్రమే ఆడుతున్నారు. రానున్న రోజుల్లో సింగిల్స్‌ విభాగంలోను బరిలోకి దిగనున్నట్లు చెబుతున్నారు.

ప్రోత్సాహకులు వీరే..
ప్రభుత్వ సహకారం లేక అకాడమీలో చేరేందుకు ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో తణుకు టీసీఎన్‌ అధినేత చిట్టూరి కృష్ణ కన్నయ్య(కన్నబాబు), మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా అండగా నిలుస్తున్నారు. గతేడాది వరల్డ్‌ టోర్నమెంట్‌కు వెళ్లాల్సిన సమయంలో ఆంధ్రాసుగర్స్‌ తరఫున బోళ్ల బుల్లిరామయ్య, పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చిబాబు) రూ.1.30 లక్షలు ఆర్థిక సాయం అందచేసి టోర్నమెంట్‌కు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement