
ధరాభారంపై నిరసన హోరు
{పభుత్వ వైఫల్యంపై వైఎస్సార్‌సీపీ సమరశంఖం
ర్యాలీలు..వినూత్న నిరసనలు
ఆందోళనలతో హోరెత్తిన మండలకేంద్రాలు
విశాఖపట్నం: ధరల పెరగుదలపై వైఎస్సార్ సీపీ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. పాడేరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీపీలు వరసన ముత్యాలమ్మ,ఎంవీగంగరాజు,పెద్ద సంఖ్యలోపార్టీ నాయకులు అంబేద్కర్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాల యం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ధరల నియంత్రణకు రూ.వెయ్యి కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు ఆ ఊసు ఎత్తడం లేదని దుయ్యబట్టారు.
వైఎస్సార్ పాలనలో ఒక్కపైసా పెంచలేదు.ః బూడిదివంగత వైఎస్సార్ ఆరేళ్ల పాలనలో ఒక్క పైసా భారాన్ని ప్రజలపై మోపలేదని.. బాబు ఏడాదిన్నరలోనే ఒక పక్క చార్జీలు..మరో పక్క ధరలు విపరీతంగా పెంచేశారని ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గంలోచీడికాడ, దేవారపల్లి, మాడుగుల మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట జరిగిన ధర్నాల్లో ఎమ్మెల్యే బూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరలను అదుపు చేయడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు.
ఈ ‘సర్కార్’కు పాలించే అర్హత లేదు..గుడివాడ
ధరలు..చార్జీల భారంతో ప్రజలనడ్డి విరుస్తున్న ఈ సర్కార్‌కు పాలించే అర్హత లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఉత్తర నియోజకవర్గం పార్టీ శ్రేణులు విశాఖలోని సీతమ్మధార అర్భన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఉత్తర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్‌తో కలిసి గుడివాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.1000కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి..ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ అలీ తదితరులు పాల్గొ న్నారు.
చినగదిలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట తూర్పు నియోజకవర్గం కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర నియోజకవర్గ పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాదరెడ్డి, రాష్ర్ట ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ర్ట కార్యదర్శి కంపా హనోక్ పాల్గొన్నారు.
మల్కాపురంలోని డిప్యూటీ తహశీల్దార్ కార్యా లయం ఎదుట పశ్చిమ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. దక్షిణ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉన్న సౌత్ ఎమ్మార్వో కార్యాల యం ఎదుట నిర్వహించిన ధర్నాలో కో ఆర్డినేటర్ కోలా గురువులు పాల్గొన్నారు.
గాజువాక తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు.ఎస్.రాయవరం తహశీల్దార్‌కారాలయాన్ని పాయకరావుపేట కో ఆర్డినేటర్, మాజీఎమ్మెల్యే చెంగల వెంకట్రావు పార్టీశ్రేణులతో కలిసిముట్టడించి ధర్నాచేశారు. నర్సీపట్నం కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి ఆర్డీఒ కార్యాలయం ఎదుట బైటా యించి ధర్నా చేశారు.
పెందుర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ కో ఆర్డినేటర్ అదీప్‌రాజు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. యలమంచలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట కో ఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు, అరకు పార్లమెంటు నియోజక వర్గ పార్టీ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మునగపాకలో ధర్నా చేశారు.అరకులోయలో పార్టీ నేతలు శెట్టి అప్పారావు, సమ్మర్ధి రఘునాధ్ పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలూ పార్టీ శ్రేణులు.. ధర్నాలతో హోరెత్తాయి.