మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఇందుకు గిరిజన యువత నడుంబిగించాలి
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు
బల్లపురాయిలో వైఎస్సార్‌సీపీ ర్యాలీ
పెదబయలు : మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని మారుమూల లక్ష్మీపేట పంచాయతీ బల్లపురాయి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తవ్వకాల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్, గిరిజనుల ప్రాణాల కంటే చంద్రబాబుకు బాక్సైటే ముఖ్యమా? అంటూ నినాదాలు చేశారు. కిలుములు గ్రామం నుంచి బల్లపురాయి వరకు ర్యాలీ సాగింది. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన్యం వాసులు ఇప్పటికే వ్యాధులతో విలవిల్లాడుతున్నారని, వైద్య సేవలు నామమాత్రమని, దీనిపై స్పందించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విలువైన ఖనిజాన్ని దోచుకోడానికి బడా కంపెనీలతో ఒప్పందం కురూర్చుకున్నాయని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలతో మన్యం అతలాకుతలం అవుతుందని, ఒడిశా వాసుల మాదిరి ఇక్కడివారు ఇతర రాష్ట్రాలకు వలసబాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తుందన్నారు. గిరిజనుల కష్టాలు ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా అంతా ఉద్యమించాలన్నారు. గ్రామాల్లోని చదువుకున్న యువత గిరిజనులను చైతన్య పరిచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. అడవి తల్లిని కాపాడుకోడానికి పాణాలు అర్పించినా ఫరవాలేదన్నారు.
బాక్సైట్ తవ్వితే పదవికి రాజీనామా
మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసం గునపం పడితే పదవికి రాజీనామా చేస్తానని అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రకటించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలతో కలిసి బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. తవ్వకాలను అడ్డుకోవడానికి ఎంతకైనా తెగిస్తానని అన్నారు. కార్యక్రమంలో పెదబయలు ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పాంగి సింహాచలం, పార్టీ మండల నాయకులు పాండురంగస్వామి, ప్రసాద్, సందడి కొండబాబు, ఎంపీటీసీ సభ్యులు పోయిభ కృష్ణారావు, లక్ష్మీపేట, అడుగులపుట్టు, సీకరి, గంపరాయి సర్పంచ్‌లు సొనాయి కమలమ్మ, అనిత,సన్యాసి, కమలాకర్, మండల కో-ఆప్సన్‌సభ్యులు షేక్ అబ్దుల్లా, ఉప సర్పంచ్ అప్పలనాయుడు పాల్గొన్నారు.