జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్‌చార్జిల చేతుల్లోకి వెళ్లిపోయింది. కీలక పోస్టులకు ఇన్‌చార్జిలే పాలకులై కూర్చున్నారు. దీంతో ఇక్కడ పనులు సక్రమంగా సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పట్టించుకొనేవారు లేక.. సిబ్బంది మధ్య ఉన్న విభేదాలు మరింత ముదురి పాకాన పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
శ్రీకాకుళం పాతబస్టాండ్:
కొద్ది సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడంతో సహా య బీసీ సంక్షేమాధికారులు (ఏబీసీ) పోస్టులు భర్తీ జరగలేదు. దీంతో సీనియర్ సంక్షేమ వసతి గృహ అధికారులకు ఏబీసీలుగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకూ ఉన్న రెగ్యులర్ జిల్లా బీసీ సంక్షేమాధికారి (డీబీసీ) బి.రవిచంద్రను జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం శుక్రవారం ప్రభుత్వానికి సరెండర్ చేయడంతో అదీ ఇన్‌చార్జి పాలనకు వెళ్లిపోయింది. దీంతో ఈ శాఖలోని జిల్లా బీసీ సంక్షేమాధికారితో పాటు ఐదుగురు సహాయ బీసీ సంక్షేమాధికారులుగా ఇన్‌చార్జీలే వ్యవహరిస్తున్నారు.
కొరవడిన సమన్వయం!
గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ శాఖలోని ఉద్యోగులో ్ల సమన్వయం కొరవడింది. ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటుగా మారింది. సిబ్బందిలో ఉన్న వివాదాలు ఆ శాఖను రోడ్డున పడేస్తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వారే కాకుండా గతంలో పని చేసి.. పదవి విరమణ చేసిన వారు కూడా ఫిర్యాదులు చేసుకోవడం ఆనవాయితీగా మారింది.
ఇన్‌చార్జిల వివరాలు ఇలా..
జిల్లా బీసీ సంక్షేమాధికారి ఇన్‌చార్జిగా శ్రీకాకుళం ఏబీసీ-2 బగాన ప్రకాశరావు వ్యవహరిస్తున్నారు. ఈయన ఆమదాలవలస వసతి గృహం సంక్షేమాధికారి. ఈయనకు శ్రీకాకుళం ఏబీసీ-2 ఇన్‌చార్జితో పాటు, డీబీసీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
శ్రీకాకుళం-1 ఏబీసీగా సత్తారు వసంత కుమారి వ్యవహరిస్తున్నారు. ఈమె శ్రీకాకుళంలోని బీసీ కళాశాల మహిళా వసతి గృహం సంక్షమాధికారిణి.
పలాస ఏబీసీగా హెచ్ కృష్ణారావు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈయన పలాస బీసీ వసతి గృహం అధికారి.
టెక్కలి ఏబీసీగా ఎం.రాఘవేంద్రరావు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈయన కోటబోమ్మాళి మండలం నిమ్మాడ బీసీ వసతి గృహం అధికారి.
పాలకొండ ఏబీసీగా ఎల్.అప్పారావు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయన కొత్తూరు మండలం లోని కడుమ బీసీ వసతి గృహం సంక్షేమాధికారిగా ఉన్నారు.
వెంటాడుతున్న వివాదాలు
-ఈ శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలు వెంటాడుతున్నాయి. జిల్లా కార్యాలయంలో కొంతమంది సిబ్బంది వారి హవా సాగించుకొనేందుకు నిరంతరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారి వల్ల కాకపోతే ఇతరులచే ఫిర్యాదు చేయించి, వారికి నచ్చిన విధంగా, నచ్చిన సీటుని పొందడం పరిపాటుగా మారింది. బదిలీ జరిగినా పలుకుబడితో జిల్లా కేంధ్రంలోనే ఉండేలా ఆధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఈ శాఖలో గతంతో పనిచేసిన డీబీసీలు కూడా వివాదాలతోనే వెళ్లిపోయారు. నాగరాణి డీబీసీగా పనిచేసిన కాలంలో పలు లోకాయుక్త కేసులు ఉండేవి.
ఆ తరువాత వచ్చిన లాలా లజపతిరావు కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్రమ బిల్లులతో నగదు స్వాహ, ఉద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.
గత ఏడాది క్రితం ఇద్దరు కింది స్థాయి ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు మాయమయ్యాయి. దీనిపై అప్పట్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
తాజాగా స్కాలర్‌షిప్పుల విభాగం కోసం ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ల మద్య వివాదం పెరిగింది. దీంతో మహిళా ఉద్యోగి ప్రైవేటు వ్యక్తుల సాయంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే డీబీసీ సరెండర్‌కు దారితీసింది.
ఇన్‌చార్జిల గుప్పెట్లో బీసీ సంక్షేమం!
Published Sun, Feb 28 2016 1:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement