
27 % లంచం
- బీసీ సంక్షేమ శాఖలో ప్రతి పనికీ ఓ రేటు
- అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పాల్సిందే!
- ప్రొటోకాల్ పేరుతో ఒక్కో హాస్టల్ నుంచి రూ.1,000 వసూలు
- లంచం ఇవ్వకపోతే బిల్లు రాదంటున్న వార్డెన్లు
- బదిలీలకు బహిరంగంగానే పైరవీలు!
మచిలీపట్నం : కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా మారింది బీసీ సంక్షేమ శాఖలో పరిస్థితి. బడుగుల పిల్లలు కడుపు కొట్టి అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్లు లేనిదే ఒక్క ఫైలు కూడా ముందుకు కదలడం లేదు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జిల్లాలో 60 వసతిగృహాలు ఉన్నాయి. ప్రతి నెలా వసతి గృహాల బిల్లుల చెల్లింపు సమయంలో అధికారులకు 27శాతం లంచంగా అందజేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వార్డెన్లు తెలిపారు. వసతిగృహాల్లో పనిచేస్తున్న వార్డెన్లు, సిబ్బందికి శాఖాపరమైన పనులు కూడా సక్రమంగా జరగడం లేదని వాపోతున్నారు. ఏదైనా ఫైలు బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయానికి వెళితే పరిష్కారం కోసం దాన్ని సిబ్బందికి పంపకుండా అధికారులు తమ వద్దే పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాటాలు ఇలా...
మామూళ్లు ఇస్తేనే ప్రతినెలా వసతిగృహాలకు సంబంధించి బిల్లులను మంజూరు చేస్తున్నారని వార్డెన్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులతోపాటు డివిజన్‌స్థాయి అధికారులు కూడా ముక్కుపిండి మరీ బిల్లు మొత్తంలో 27 శాతం లంచం వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. దీనిలో ఏఎస్‌డబ్ల్యూవోలు 15 శాతం, ఉన్నతాధికారులు 12 శాతం పంచుకుంటారని ఓ వార్డెన్ చెప్పారు.
ఎవరైనా నెలవారీ మామూళ్లు అందజేయకపోతే సదరు హాస్టల్‌పై అధికారులు దాడి చేస్తారని, వివిధ కారణాలు చూపి ఇబ్బందులు పెడతారని, మామూళ్లు అందజేసిన తర్వాత ‘అంతా బాగుంది..’ అంటూ సర్దుకుపోవడం సర్వసాధారణంగా మారిందని మరో వార్డెన్ వివరించారు. మరోవైపు ప్రొటోకాల్ పేరుతో ప్రతి హాస్టల్ వార్డెన్ నెలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఉన్నతాధికారులకు ముట్టజెబుతున్నారు. ఈ మొత్తం అందజేయడం ఒక్కరోజు ఆలస్యమైనా, వెంటనే సంబంధిత హాస్టల్లో ఉన్నతాధికారులు తనిఖీ చేసి ఇబ్బందులు పెడతారని వార్డెన్లు చెబుతున్నారు.
పది నెలలుగా వేతనాలు లేవు
జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో 87 మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.6,700 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. పది నెలలుగా వీరికి జీతాలు విడుదల చేయలేదు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమకు వేతనాలు విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయానికి వెళితే.. ‘మీరు అనేక తప్పులు చేశారు.. వేతనాలు ఎలా చెల్లిస్తాం..’ అంటూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి వెనక్కి పంపిస్తున్నారని పలువురు సిబ్బంది వాపోయారు. 2013, అక్టోబరు నుంచి వసతిగృహాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి, 2014, ఫిబ్రవరి నుంచి బీసీ సంక్షేమ కళాశాల వసతి గృహాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందజేయాల్సి ఉంది.
అన్నీ పారదర్శకంగానే : డీడీ
అయితే, బీసీ సంక్షేమ శాఖలో ఎలాంటి అవకతవకలు జరగటం లేదని బీసీ సంక్షేమ శాఖ డీడీ ఎం.చినబాబు ‘సాక్షి’కి తెలిపారు. బిల్లుల చెల్లింపులన్నీ పారదర్శకంగానే ఉంటాయని ఆయన చెప్పారు. ప్రొటోకాల్ పేరుతో బీసీ సంక్షేమ శాఖలో ఎలాంటి వసూళ్లకు పాల్పడటం లేదని పేర్కొన్నారు.
లంచం అందలేదని పదోన్నతులకూ బ్రేక్!
బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్-1 వసతిగృహాల పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్-2 వార్డెన్లుగా పనిచేసే వారికి గ్రేడ్-1 వార్డెన్‌గా పదోన్నతి ఇవ్వాలంటే ఒక్కొక్క పోస్టుకు లక్ష రూపాయలు సమర్పించుకోవాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూళ్లు ఇవ్వకపోవడంతో ఏడాదికాలంగా వీటిని భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్లాస్-4 ఉద్యోగులకు విద్యార్హతలు ఉన్నప్పటికీ వార్డెన్లుగా పదోన్నతులు కల్పించాలంటే దానికి ప్రత్యేక ధరను నిర్ణయించారని బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం బదిలీలు జరగనున్న నేపథ్యలో ‘ఎవరు ఏ ప్రాంతానికి వెళతారు.. ఎవరు ఎంత ఇస్తారు...’ అంటూ ఏఎస్‌డబ్ల్యూవోలు బహిరంగంగానే బేరాలకు దిగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.