
అక్రమ కేసులకు భయపడం: చెవిరెడ్డి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని వైఎస్సార్ సీపీ నాయకుడు, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్ సీపీ బలీయంగా ఉండటం, సొంత నియోజకవర్గం చంద్రగిరిలో తాము విజయం సాధించడం జీర్ణించుకోలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి నీచపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో రాజమహేంద్రవరంలో పోలీసులు పెట్టిన బెదిరింపు కేసులో పీటీ వారంట్ పెండింగ్‌లో ఉంది. దీంతో శుక్రవారం నెల్లూరు వెళ్లిన పోలీసులు శనివారం ఉదయం చెవిరెడ్డిని నెల్లూరుజైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. మూడో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులతో మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరుచేశారు.
తర్వాత మళ్లీ చెవిరెడ్డిని నెల్లూరు తీసుకెళ్లేందుకు పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అసహనం పెరిగిపోయిన ప్రభుత్వం ఇంకెన్ని అక్రమ కేసులు బనాయించినా ఎదుర్కొంటామే తప్ప మడమ తిప్పేది లేదన్నారు. కాగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చెవిరెడ్డి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు గురవుతోంది.