వైఎస్సార్ సీపీ నాయకులే లక్ష్యంగా దాష్టీకం
అధికార పార్టీ ప్రతినిధుల్లా పోలీస్ అధికారులు
ముఖ్య నేతల ఆదేశాలే శిరోధార్యంగా వృత్తికి ద్రోహం
చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, పొన్నూరులలో అరాచకాలు..
వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు
పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి చిత్రహింసలు
ఇప్పటికే రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
గుంటూరు : సాక్షాత్తూ పోలీస్ అధికారులే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం చెవికెక్కించుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు చెప్పిందే చేస్తున్నారు. అది అక్రమమా సక్రమమా అనేది పరిశీలించడం లేదు. అధికార పార్టీ నేతల అక్రమ వ్యాపారానికి ప్రమోటర్లుగా వ్యవహరిస్తూ, అడ్డు వచ్చే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఫలానా నేత చెప్పినట్లు వింటే సరే లేదంటే అంటూ... సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులే బెదిరిస్తున్నారు. రూరల్ జిల్లా పరిధిలోని కొందరు సీఐ, ఎస్సై స్థాయి అధికారులు టీడీపీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు. పొన్నూ రు, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరి పేట నియోజకవర్గాల్లో పోలీసు అధికారుల తీరు అరాచకాన్ని తలపించే రీతిలో ఉందని ప్రజల నుంచే విమర్శలు వస్తున్నాయి.
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏళ్లతరబడి వ్యాపారాలు చేసుకుంటున్న వారి వద్ద నుంచి అధికార పార్టీ ముఖ్యనేత దౌర్జన్యంగా ఆ వ్యాపారాలను లాక్కొని తమ బినామీలకు అప్పజెప్పారు.
ఈ నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందంటూ వచ్చిన వ్యాపారులను పోలీసులు బెదిరించడమే కాకుండా, వారిపైనే అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేశారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారనే అక్కసుతో అధికార పార్టీ నేత పోలీసులను ఉసిగొల్పుతున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి పోలీసులు సహకరిస్తూ తమ స్వామి భక్తిని చాటుతున్నారు.
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అక్కడి అధికారపార్టీ ముఖ్యనేత తనయుడు చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టికాలకు పోలీసు అధికారులు సహకరిస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేత కనుసన్నల్లో నడుస్తున్న పోలీస్ అధికారులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యనేత చెప్పిన అడ్డమైన పనులు చేయలేక కొందరు పోలీసు అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాత్రం అధికారపార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు. ఆ ముఖ్యనేత వ్యాపారానికి సహకరించని వారిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సుమారు 200 మంది పోలీసులతో వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేశారు.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గురువారం రూరల్ జిల్లా ఎస్పీ నారాయణనాయక్‌ను కలసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రజలను హింసిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఖాకీ దూకుడు!
Published Sat, Dec 5 2015 12:41 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement