పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెడతారనే సమాచారం మేరకు సమైక్యాంధ్ర ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు.
సాక్షి, ఒంగోలు: పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెడతారనే సమాచారం మేరకు సమైక్యాంధ్ర ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఐజీ సునీల్‌కుమార్ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని మంగళవారం తన రేంజ్ పరిధిలోని గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి సంబంధిత పోలీస్ అధికారులకు ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రత్యేక సూచనలు చేశారు. దీనిలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌తో పాటు నగర డీఎస్పీ జాషువా, పలువురు నగర సీఐలతో సమావేశమయ్యారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడితే దాన్ని జిల్లాలో తీవ్రంగా వ్యతిరేకించే క్రమంలో భాగంగా అల్లర్లు చోటుచేసుకోవడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లేలా ఆందోళనకారులు వ్యవహరించే అవకాశాలున్నాయని అన్నారు. సందర్భానుసారం పోలీస్ అధికారులు వ్యవహరించాల్సి ఉంటుందని ఐజీ పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర నేతలు శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేస్తే పోలీసులు వాటికి అనుమతినివ్వాలని, అయితే ఏ మాత్రం హింసాయుతంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు చేపట్టి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని సూచించారు.
ఇప్పటికే జిల్లాలో ఉన్న 4 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది, ఒక కంపెనీ బీఎస్‌ఎఫ్ బలగాలతో పాటు తాజాగా శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన 300 మంది కానిస్టేబుళ్లతో పాటు ఏఆర్ సిబ్బందిని వినియోగించుకోవాలని, ఏ మాత్రం అవసరం అనిపిస్తే యుద్ధప్రాతిపదికన కేంద్ర బలగాలను దింపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఐజీ తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి శాంతిభద్రతలను కాపాడే విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఏఆర్ అడిషినల్ ఎస్పీ కృష్ణయ్య, సీఐలు బీటీ నాయక్, సూర్యనారాయణ, భూషణం, ఐ.శ్రీనివాసన్, అశోక్‌వర్ధన్, ఎస్‌బీ సీఐ తిరుమలరావులు పాల్గొన్నారు. అనంతరం ఐజీ నెల్లూరు జిల్లాకు వెళ్లారు.