సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చుక్కలు చూపించింది.. | Be careful of friends of Facebook, woman cheats software engineer | Sakshi
Sakshi News home page

విప్రో ఇంజనీర్‌నంటూ చుక్కలు చూపించింది..

Published Mon, Apr 17 2017 9:24 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చుక్కలు చూపించింది.. - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చుక్కలు చూపించింది..

చీరాల : మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను అంగీకరించిన యువకుడికి మాయలేడీ చుక్కలు చూపించింది. బాధితుడి కథనం మేరకు.. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలేనికి చెందిన వింజమూరి సురేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సర్వీస్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. జనవరిలో తన ఫేస్‌బుక్‌కు ఓ యువతి చల్లా పల్లవి అనే పేరుతో, ప్రొఫైల్‌ పిక్చర్‌లో మలయాళ హీరోయిన్‌ ఫొటో పెట్టి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. రిక్వెస్ట్‌ను సురేశ్‌ అంగీకరించి ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసుకున్నారు.

తాను ఇన్ఫోసిస్‌లో జావా డెవలపర్‌ టీం లీడర్‌గా పనిచేస్తానని చెప్పింది. తన తండ్రి ఒంగోలులో డీఎస్పీగా పనిచేస్తున్నాడని ఆయన ఫోన్‌ నంబర్‌ ఇచ్చింది. తర్వాత తన అసలు పేరు మౌనిక, సొంతూరు చీరాల కొత్తపేటని చెప్పింది. ప్రేమిస్తున్నానని చెప్పడంతో ప్రేమను అంగీకరించాడు. చివరకు ఒకరోజు ‘మన ప్రేమను మా నాన్న అంగీకరించలేదని, నిద్ర మాత్రలు మింగానని చెప్పింది. దీంతో సురేశ్‌ ఒంగోలులో డీఎస్పీకి ఫోన్‌ చేయగా మౌనిక పేరుతో తనకు కూతురే లేదని చెప్పాడు. తర్వాత మూడు రోజుల్లోనే మౌనిక.. సురేశ్‌కు ఫోన్‌చేసి తన బావతో ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్నానని సమాచారం అందించింది. హోటల్లో ఉన్న మౌనికను కలిసేందుకు సురేశ్‌ వెళ్లాడు.

అక్కడ నల్లగా పెద్ద వయసు ఉన్న ఓ మహిళ తాను మౌనికగా పరిచయం చేసుకుంది. విషయం అర్థమైన సురేశ్‌ అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించగా గది తలుపులు మూసేసి ఇక్కడి నుంచి వెళ్తే మీ కుటుంబమంతా జైలుకెళ్తుందని బెదిరించి దండలు మార్పించింది. సురేశ్‌ బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. మౌనికను, ఆమె నాయనమ్మ అని చెప్పుకుంటున్న వృద్ధురాలిని తీసుకుని విజయవాడ రైల్లో బయలుదేరారు. మధ్యలో సురేశ్‌ బంధువులు వచ్చి వారిని అడ్డుకోవడంతో.. అక్కడి నుంచి మౌనిక, వృద్ధురాలు పారిపోయారు.

తరువాత విచారణ చేయగా అసలు ఆమె పేరు మౌనిక కాదని.. ఉయ్యాల కనక మహాలక్ష్మి (35) అని, అనేక కేసుల్లో నిందితురాలని తేలింది. ఆమెకు పెళ్లై భర్త చనిపోయి ఇద్దరు పిల్లలున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం సురేశ్‌ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి కులం పేరుతో దూషించాడని కనకమహాలక్ష్మి ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితుడు కూడా ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, చీటింగ్‌లో ఆమె ముద్దాయి. ఆమెపై తిరుపతి సీసీఎస్, క్రైం, నార్కెట్‌పల్లి పీస్‌లో అరెస్టు వారెంట్, కందుకూరులో అనుమానాస్పదురాలిగా కేసులున్నాయి. ఈ కేసు నుంచి నువ్వు బయట పడాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని కూడా బెదించిందని బాధితుడు వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement