
భద్రాచలం సీమాంధ్రకు చెందడమే న్యాయం: సీఆర్
భద్రాచలం పుణ్యక్షేత్రం సీమాంధ్రప్రాంతానికి చెందడమే న్యాయమని రాష్ర్ట దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు.
అన్నవరం: భద్రాచలం పుణ్యక్షేత్రం సీమాంధ్రప్రాంతానికి చెందడమే న్యాయమని రాష్ర్ట దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం అతిథిగృహంలో ఆయన గురువారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతమంతా భద్రాచలంలోనే ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపడమే సమస్యకు పరిష్కారమన్నారు.
ఏ గొంతెమ్మ కోరిక కోరినా తెలంగాణవాదులకు అందంగానే కనబడుతోందని, సీమాంధ్రులు ఏం కోరినా తెలంగాణవాదులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధాని అభివృద్ధిలో సీమాంధ్ర ప్రాంత ప్రజల పాత్ర అధికంగా ఉన్నందున హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడమే సమంజసమన్నారు. ఈ విషయమై కేంద్రమంత్రి చిరంజీవి ప్రకటనను అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టడాన్ని విమర్శించారు.
రాయలసీమను విభజించాలనే హక్కు ఎవరికీ లేదని, నాలుగు జిల్లాలూ కలసి ఉండాల్సిందేనన్నారు. విభజన జరగకూడదనే తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్నారు. తెలంగాణవాదులు కావాలనే విద్వేషపూరితవాతావరణాన్ని కలగజేశారన్నారు. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటుకు అనుసరించిన ప్రక్రియకన్నా భిన్నంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సాగుతోందని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.