
భిక్షాటన చేసి రాజధాని నిర్మిస్తారా?
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుండీ పెట్టడం సరికాదని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. భిక్షాటన చేసి రాజధాని నిర్మిస్తామనడం అవమానకరమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి విరాళాల కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ వద్ద, సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో హుండీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.