పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై భారతీయ జనతా పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సైతం తీసుకెళ్లారు అని వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావడం ఇబ్బందే కాదని, ఇక్కడ పనులు చేపట్టడమే సమస్య అని తెలిపారు.
రాష్ట్ర ప్రాజెక్టు పనులకు అంచనాలు తయారు చేసి, పనులకు సంబంధించిన బిల్లును కేంద్రానికి అందజేస్తే వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో స్పష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరును మార్చడం సరికాదని.. అభిప్రాయపడ్డారు.
పుష్కరాల అవినీతిపై విచారణ జరుగుతోంది
గోదావరి పుష్కర పనుల అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలకు స్నాన ఘట్టాల గుర్తింపు, దేవాదాయ శాఖ తరుఫున చేట్టాల్సిన పనులపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన చెప్పారు.