విజృంభిస్తున్న విష జ్వరాలు | Booming toxic fevers | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న విష జ్వరాలు

Published Thu, Sep 11 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

విజృంభిస్తున్న విష జ్వరాలు

విజృంభిస్తున్న విష జ్వరాలు

  •       మంచాన పడుతున్న పల్లెలు
  •      కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
  •      పారిశుద్ద్యం అస్తవ్యస్తం
  •      ఆందోళనలో గ్రామాలు
  • పెడన/ నందిగామ రూరల్ : జిల్లాలోని ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఇంటికొకరు జ్వరంతో అల్లాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుని పోవడంతో పాటు రోజుల తరబడి మురుగునీటి నిల్వలుండడంతో పారిశుద్ద్యం అస్తవ్యస్తంగా మారిపోయింది.

    గ్రామ పంచాయతీ, వైద్య సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో పరిస్థితి ఘోరంగా ఉంది.  అధిక శాతం మంది పేదవారు కావడంతో రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితి.  గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామం, నందిగామ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో జ్వర పీడితులు అల్లాడుతున్నారు. నందిగామలోని డీవీఆర్ కాలనీ, తక్కెళ్లపాడులో జ్వర పీడితులు అధికంగా ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు.  ఏరియా ప్రభుత్వాస్పత్రికివచ్చే వారిలో 60 శాతం వరకు జ్వర పీడితులే ఉంటున్నారని ప్రభుత్వాస్పత్రి వైద్యులు చెబుతున్నారు.
     
    మంచాన పడ్డ కప్పలదొడ్డి....

     
    గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో సూమారు మూడు వేలమంది జనాభా ఉంటుంది. చేనేత, కలంకారీ కార్మికులతో పాటు ఇతర వ్యవసాయాధారిత కుటుంబాలు నివాసం ఉంటుంన్నాయి.  నెహ్రూ నగర్‌లోని అరవై ఏళ్ల యక్కల శ్యామలరావు ఎంతకూ జ్వరం తగ్గక పోవడంతో  ప్లేట్‌లెట్స్ తగ్గి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది  ఇంటికి చేరుకున్నాడు.  కాటే నాగపైడేశ్వరమ్మ జ్వరంతో మంచాన పడిఉంది. పేరిశెట్టి మల్లేశ్వరరావు, యక్కల నాగకోటేశ్వరరావు జ్వరంతో స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుల వద్దనే చికిత్స పొందుతున్నారు. దళిత వాడలో ఎంపీ శ్రీనుతో పాటు మరో 50 మంది  జ్వరాలతో మంచాన పడి ఉన్నారు.  

    భగత్ సింగ్ నగర్ కాలనీలో ఇంటికొకరు జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.  మల్లేశ్వరరావు కాలనీలో పారిశుద్ద్యం అస్తవ్యస్తంగా ఉంది. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మొదలుకుని మల్లేశ్వరరావు కాలనీ శివారు వరకు పేడ, చెత్త చెదారం పేరుకుపోయి ఉంది. జెడ్పీ హైస్కూల్  రోడ్డు చుట్టూ ఉన్న స్థానికులు చెత్త చెదారం వేయడంతో దుర్గంధ పూరిత వాసన వెదజల్లి స్థానికంగా ఉండలేని దుస్థితి నెలకొంది.  
     
    వైరల్ జ్వరాలకు కారణం....


    వర్షాకాలంలో ఒకే ప్రాంతంలో నీరు అధికంగా నిల్వ ఉండడం వలన ఆ నీటిపై లార్వా ఏర్పడి దోమలు పెరుగుతాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దోమలు వృద్ధి చెందుతుంటాయి. ముఖ్యంగా వర్షపునీరు వినియోగించి పక్కన పడేసిన కొబ్బరి బోండాల్లో నిల్వ ఉండడం వలన, టైర్లు, పనికి రాని వస్తువుల్లో నీరు వారానికి మించి నిల్వ ఉండడం కూడా దోమలు వృద్ధి చెందే ప్రమాదం ఉందని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా వర్షాకాలంలో వైరల్ జ్వరాలు దోమకాటు వలనే వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు.
     
    పట్టించుకోని పంచాయతీ, ఆరోగ్య సిబ్బంది....

    గ్రామాల్లోని పంచాయతీ సిబ్బంది నెలలో ఒక్కసారి కూడా పారిశుద్ద్య పనులు నిర్వహించడం లేదని  బాధితులు వాపొతున్నారు.  ఆరోగ్య వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారగణం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా... ఉన్నత వైద్యాధికారులు సబ్ సెంటర్లను ఒక్క మారు కూడా సందర్శించిన దాఖలాలు లేవు.  గ్రామాల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు ఆరోగ్యశాఖ సిబ్బంది వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement