
మృత్యుంజయుడు
పరవాడ: ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ చిన్నారి ఒక రైతు సమయస్ఫూర్తిగా వ్యవహరించటంతో మృత్యుంజయుడయ్యాడు. విశాఖ జిల్లా పరవాడ మండలం నాయుడుపాలెం శివారు పాతరాజానపాలెంలో సోమవారం ఈ ఘటన జరిగింది. తల్లితో పాటు అమ్మమ్మ ఇంటికి వచ్చిన దీప్ (2) సరుగుడు తోట వద్దకు వెళ్లిన అమ్మమ్మ నేస్తాలమ్మను చూసి అక్కడికి వెళ్లాడు.
ఆడుకుంటూ వ్యవసాయ బోరు బావిలోకి జారిపోయి 20 అడుగుల లోతుకు వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన నేస్తాలమ్మ కేకలు వేసింది. అక్కడే ఉన్న రైతు మండల అప్పలనాయుడు పరుగున వచ్చి బోరు బావిలో పడిన దీప్‌ను తాడు సాయంతో చాకచక్యంగా బయటకు లాగి రక్షించాడు. దీంతో అతడ్ని అంతా అభినందించారు. చిన్నారి అమ్మానాన్న లక్ష్మి, నరసింగరావు సంతోషించారు.