
దివాకర్ రెడ్డిని బహిష్కరించి పారేస్తా!
పీసీసీ చీఫ్ బొత్స తీవ్ర ఆగ్రహం
ఆయనేమైనా పెద్ద పుడింగా?
షోకాజ్ నోటీస్ కూడా అవసరం లేదు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తామని, అహంకారంతో, దొరతనంతో మాట్లాడుతున్న జేసీకి షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ అడగాల్సిన అవసరం కూడా లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోనియాను విమర్శించినంత మాత్రాన పెద్ద పుడింగి అవుతాననే భావంతో జేసీ ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బొత్స మంగళవారం ఇక్కడ తన నివాసంలో మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలి.పార్టీలోనే ఉండాలంటూ ఆయనను ఎవరూ బతిమిలాడ్డం లేదు. పార్టీ నాయకత్వం నుంచి సోనియాగాంధీని తప్పించాలనడం చాలా తప్పు. ఇది సహించరానిది. ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీకి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరంలేదు. పార్టీ నుంచి బహిష్కరిస్తాం. ఈ మేరకు హైకమాండ్‌కు కూడా లేఖ రాశాను’ అని పేర్కొన్నారు. జేసీ తమ్ముడు ప్రభాకర్‌రెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చినా పార్టీలో ఉన్నారనే భావనతో సహించామని చెప్పారు. యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ప్రవేశపెట్టడం ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చిరంజీవి కూడా తనతో చెబుతూ బాధపడ్డారని చెప్పారు. ఎంపీలపై చర్యల విషయం హైకమాండ్ చూసుకుంటుందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో పార్టీ హైకమాండ్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ ధిక్కారం కాదని బొత్స అన్నారు. వాటిని ఆవేదనతో కూడిన వ్యాఖ్యలుగానే పరిగణించాలన్నారు.
ఎవరి అభిప్రాయం వారిదే
అసెంబ్లీలో విభజన బిల్లు చర్చకు వస్తే సభ్యులు తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వెల్లడిస్తారని తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తాను కూడా విభజనను వ్యతిరేకిస్తానన్నారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందా? ఉండదా? అనే విషయం తనకు తెలీదని, అసెంబ్లీ బీఏసీ నిర్ణయిస్తుందన్నారు. హైదరాబాద్‌కు వస్తున్న పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను పార్టీ నేతలెవరైనా కలవొచ్చని బొత్స స్పష్టం చేశారు. దిగ్విజయ్ 13న ఢిల్లీ వెళ్తారన్నారు. ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ విభజన చేస్తోందని విమర్శిస్తున్న చంద్రబాబు సమైక్యం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ‘రాయలసీమలో పుట్టి ఆంధ్రా అమ్మాయిని పెళ్లి చేసుకున్న నువ్వు విభజనకు అనుకూలంగా ఎలా లేఖ ఇచ్చావు? నిన్ను ఏ సముద్రంలో విసిరేయాలి? గోదావరిలో ముంచాలా లేక కృష్ణా నదిలో కలిపేయాలా?’ అని విరుచుకుపడ్డారు.
జేసీ ఓ చీడపురుగు: ఆమోస్
జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడపురుగని, స్వార్థం కోసం ఆయన ఎంతటి నీచానికైనా దిగజార తారని ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. జేసీని వెంటనే డిస్మిస్ చేయాలన్నారు.
జేసీపై చర్యలు తీసుకోవాలి: దామోదర్‌రెడ్డి
పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై విమర్శలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డితో పాటు కేంద్రంలోని సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోనియాను దేవత అన్నవారే ఇప్పడు విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు.