నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్ : సొంత అవసరాల కోసం తెలిసిన వారితో పాటు తమ వద్ద అప్పులు తీసుకుని పరారీలో ఉన్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. జమానాతు ఇచ్చిన పాపానికి తమ వేతనాలకు ఎసరు వచ్చిందని సదరు ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో ప్లానింగ్ విభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేసే వెంకటేశం కొద్ది నెలల క్రితం తోటి ఉద్యోగుల వద్ద, తెలిసిన వారి వద్ద దాదాపు రూ.1.80 కోట్ల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. ఇందులో రూ.30 నుంచి 40 లక్షల వరకు వివిధ చిట్‌ఫండ్ కంపెనీలలో చీటీలు ఎత్తుకుని తోటి ఉద్యోగులను జమానాతు పెట్టాడు.
ఓ పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క ప్రైవేట్‌గా పలు వ్యాపారాలు చేసేవాడని సంస్థ ఉద్యోగులు తెలిపారు. దానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కావటంతో తెలిసిన వారివద్ద,తోటి ఉద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్యోగులకు కనిపించకుండా పోయాడు. విధులకు కూడా గైర్హాజరవుతున్నాడు. కనిపించకుండా పోయిన వెంకటేశం కోసం ఉద్యోగులు పలు చోట్ల ఆరా తీసినప్పటికి ఆచూకీ లభ్యం కాలేదు. చిట్‌ఫండ్‌లో ఎత్తుకున్న డబ్బులు చెల్లించక పోవటంతో జమానాతులు ఉన్న ఉద్యోగులకు చిట్‌ఫండ్ కంపనీల నుంచి వేతనం కటింగ్‌ల నోటీసులు జారీ అయ్యాయి. దీంతో కంగారు పడిన ఉద్యోగులు రెండు రోజుల కిత్రం జిల్లా ఎస్పీ కేవీ మోహన్‌రావును ఆశ్రయించారు. కనిపించకుండా పోయిన వెంకటేశంను ఇక్కడకు రప్పించాలని వినతి ఇచ్చారు. ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుపై తగిన న్యాయం చేస్తామని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు.ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదును ఎస్పీ డీఎస్పీ అనిల్‌కుమార్‌కు పంపారు. ఆయన దానిని నగర సీఐకి పంపి విచారించాలని ఆదేశించారు. అయితే ఉద్యోగులు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వెంకటేశంకు దాదాపు రూ.40 లక్షల వరకు జమానాతులు పెట్టినట్లు చెప్పారు. కాని మిగతా రూ.1.40 కోట్లపై బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదులు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఫైనల్ నోటీసులు జారీచేశాం..
సంస్థలో టెలికాం సూపర్‌వైజర్‌గా పనిచేసే వెంకటేశం నాలుగు నెలలుగా విధులకు గైర్హాజరవుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు శాఖాపరమైన నోటీసులు జారీచేశాం.అతని నుంచి ఎలాంటి స్పందనలేదు. ఇటీవలే చివరిసారిగా నోటీసులు సైతం జారీచే శాం.శుక్రవారం విధులకు హాజరవుతానని చె ప్పాడు. కాని కాలేదు. కొంతమంది ఉద్యోగులు అతనిపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అతనిపై చీటింగ్ కేసు నమోదైతే చర్యలకు పైఅధికారులకు నివేదిస్తాం.
- జగ్గురాం, బీఎస్‌ఎన్‌ఎల్ ఏజీఎం
బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి ఘరానా మోసం
Published Sun, Sep 22 2013 5:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement