రూపాయితో రోమింగ్
Published Fri, Jan 31 2014 1:46 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : ఒక్క రూపాయితో దేశంలో ఎక్కడనుంచి ఎక్కడికైనా ఎటువంటి అదనపు రోమింగ్ చార్జీలు లేకుండా బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి కాల్ చేసుకోవచ్చని ఆ సంస్థ జనరల్ మేనేజర్ హెచ్.సీ.మహంతి తెలిపారు. శ్రీకాకుళంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త పథకాలను అమలు చేయడంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ముందంజలో ఉందన్నారు. ఒకే జాతి, ఒకే నంబర్, ఒకే రూపాయి రోజుకు అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దీనికి రూ. 90 ఎస్‌టీవీ ఓచర్‌ను రీ ఛార్జి చేయాల్సి ఉంటుందని, దీని కాలపరిమితి 90 రోజులన్నారు. అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్‌గా ఉండే ఈ పథకానికి ఔట్‌గోయింగ్ కాల్స్‌కు సెకండ్‌కు 1.5 పైసా చార్జి చేస్తారని తెలిపారు.
‘స్వాగతం’ ప్లాన్ ద్వారా రూ.20ఓచరుతో లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌కు 2 సెకండ్లకు ఒక పైసా చొప్పున చార్జీ చేస్తారని, దీని కాలపరిమితి 60 రోజులని తెలిపారు. రూ.5 వేల నుంచి రూ.10 వేలు టాపప్ ఓచర్లు తీసుకున్నవారికి 20 శాతం అదనంగా యూసేజ్ వాల్యూ ఉంటుందన్నారు. మార్చి 31లోగా రూ.200 నుంచి రూ.990 టాప్ అప్ తీసుకున్న వారికి పూర్తి టాక్ టైమ్ ఉంటుందన్నారు. రూ.1000 నుంచి రూ.2999 వరకూ టాపప్ తీసుకున్న వారికి 10శాతం అదనంగా యూసేజ్ వాల్యూ వస్తుందన్నారు. జిల్లాలో శ్రీకాకుళం పట్టణం, ఆమదాలవలస, సోంపేట ప్రాంతాలలో 3 జీ సేవలు మెరుగుపరచడంతో పాటు నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, ప్రాంతాల్లో 3జీ సేవలను విస్తరించినట్లు తెలిపారు. అందులో ఐతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోసం 3జీ బీటీఎస్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 3జీ సేవల విస్తరణతో 2జీ సేవలతో పాటు స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్ సౌకర్యం లభిస్తుందన్నారు.
పస్తుతం జిల్లాలో 2జీ సెల్ టవర్లు 182, 3జీ సెల్‌టవర్లు 53 పనిచేస్తున్నాయన్నారు. ఫిబ్రవరి మాసాంతానికి మరో 9సెల్ టవర్లను (అల్లినగరం, అక్కులపేట, మండ్ల, లకందిడ్డి, బొద్దాం, చినుజ్జివాడ, బెజ్జిపురం, కొర్లాం, మెట్టూరు ప్రాంతాలలో) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సెల్‌వన్ వినియోగదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, గతంలో 2.85 లక్షల కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 3.20 లక్షలకు చేరిందని, వైమాక్స్ కనెక్షన్లు 73 నుంచి 88కి పెరిగిందన్నారు. రెవెన్యూ పరంగా రూ.26 కోట్లకు చేరింది. బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు వినియోగించుకుని వినియోగదారులు మరింత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సమావేశంలో డి.జి.ఎం.యోగీశ్వరరావు, సీఏవో నాగరాజు, ఏజీఎం(మార్కెటింగ్) మహేశ్వరరావు, టెక్నికల్ సూపర్‌వైజర్ ఆనంద్‌మోహన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement