సామాన్యుడిని విస్మరించిన బడ్జెట్ | Budget 2015 | Sakshi
Sakshi News home page

సామాన్యుడిని విస్మరించిన బడ్జెట్

Published Sun, Mar 1 2015 2:18 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

Budget 2015

యూపీఏ కంటే మెరుగైన పాలన అందిస్తాం.. సామాన్యుడికి అందుబాటులో ఉంటాం.. కష్టాలు తెలిసిన ఒకప్పటి ఛాయ్‌వాలా ప్రధాని అయ్యారు.. పాలన మధ్యతరగతి చేతిలో వజ్రాయుధం అంటూ ఇంతకాలం బీజేపీ నేతలు ప్రకటిస్తూ వచ్చారు. అయితే నరేంద్రమోడీ సర్కార్ తీరును బడ్జెట్‌లు తేటతెల్లం చేశాయి. ఈ ప్రభుత్వం కూడా సంపన్నులకే దాసోహమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ చెప్పకనే చెప్పింది. సామాన్యుడిని గుర్తించకపోగా, సర్వీసు ట్యాక్స్ పెంచి మరింత భారం మోపింది. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలకు చేతలకు పొంతనలేదని పలువురు విమర్శిస్తున్నారు.
 
 
 సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు, చిరుద్యోగులకు ఈ బడ్జెట్‌తో నిరాశే మిగిలిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సంపన్నులకు చేయూతనిస్తూ కార్పోరేట్ ట్యాక్స్ 5శాతం తగ్గిస్తే.. అదే రైతుల ఉత్పత్తులైనా ఆహార నిల్వలపై ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో వైపు సర్వీసు ట్యాక్స్ పెంచుతూ మరింత భారం పడేలా వ్యవహరించింది. ఈ పరిణామాన్ని రాజకీయవేత్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
 
  వ్యవసాయ ఉత్పత్తులకు తగ్గట్టుగా ఆదాయం పెంపు లేదు. ప్రణాళికేతర వ్యయం పెరిగినప్పుడు ఉత్పత్తులకు ఆశించిన చేయూత కేంద్ర ప్రభుత్వం కల్పించలేకపోయిందని రైతు సంఘాలు వాపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఐఐఎం, ఐఐటీ, నిట్‌లకు రూ.40కోట్లు చొప్పున కేటాయించారు. ట్రిపుల్ ఐటీకి రూ.45కోట్లు దక్కింది. ఈ లెక్కన జిల్లాలో ఉన్న ట్రిపుల్ ఐటీకి రూ.15కోట్లు కేంద్ర బడ్జెట్ దక్కనుంది. మొత్తంగా పరిశీలిస్తే సామాన్యుడికి మధ్యతరగతి ప్రజానీకానికి అరుణ్‌జైట్లీ బడ్జెట్ గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
 - సాక్షి ప్రతినిధి, కడప
 
 పథకాలు ఆచరణలో పెట్టాలి
 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రవేశపెట్టి న పథకాలను ఆచరణలో పెడితేనే ప్రయోజనం. ముఖ్యంగా 24 గంటల విద్యుత్ సరఫరా, గ్రామాలకు తాగునీ టి సౌకర్యం, రహదారుల నిర్మాణం, రవాణా సౌకర్యంతోపాటు ప్రతి ఇంటికి ఉపాధి కల్పనలో భాగంగా ఉద్యోగం కల్పిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం సంతోషకరం. గొప్పలు చెప్పడం కాదు వాటిని ఆచరణలో తీసుకురావాలి. ప్రస్తుత పాలకులుమాటలతో తాత్కాలికంగా కడుపునింపే ప్రయత్నం చేశారు.      - రాచమల్లు శివప్రసాదరెడ్డి,ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు
 
 ఆశాజనకంగా లేని బడ్జెట్
 ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదు. నిరాశను కలిగించింది. రాష్ట్రం కేంద్రప్రభుత్వానికి పొత్తున్న పార్టీ టీడీపీ కూడా ఈ బడ్జెట్‌కు వ్యతిరేకండా ఉన్నారన్నారు. అధిక రేట్లు వాటిని తగ్గించేందుకు, తక్కువ ధరలున్న వాటిని పెంచటం చేశారు. ఇలా చేయటం వలన దేశంలో ఉన్న అధిక భాగం పేద, సామాన్య ప్రజలకు ఏ మాత్రం మేలు జరుగదు.    
 - ఎస్. రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు
 
 ఏపీకు తీరని అన్యాయమే
 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగింది. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రజల కడుపులో కారం వేశారు. శవంపై నాలుగు బోరుగులు చల్లినట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు రూపాయలు కేటాయించారు. తెలుగువారంటేనే ఏమీ చేయలేరనే భావనలో కేంద్రం ఉంది.       
 - దేవగుడి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ
 
 సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఏదీ?     
 కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. విభజనకు ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదు. లోటు బడ్జెట్‌ను పూడుస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు. ముఖ్యంగా సీమకు స్పెషల్ ప్యాకేజీ, తదితర సౌకర్యాలను ఇస్తామని చెప్పారు. ఏదీ జరగలేదు. ఈ బడ్జెట్ నిరుపేద వర్గాలను తీవ్రంగా నిరాశకు గురిచేసింది.    
 - అంజాద్‌బాష, కడప ఎమ్మెల్యే
 
 
 కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
 నాడు కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమయంలో అడ్డదిడ్డంగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తే నేడు బీజేపీకి  విభజన చట్టంలో ప్రవేశపెట్టిన ఏ  ఒక్క అంశాన్ని  పట్టించుకోకుండ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల కడుపుల్లో చిచ్చుపెట్టింది.టీడీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లనేబడ్జెట్‌లో తీరని అన్యాయం  జరిగింది. రాయలసీమ అభివృద్ధికి నిధుల ప్రస్తావనలేదు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు లేవు. నిధులు ప్రస్తావన ఎక్కడలేదు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఐక్యమత్యంగా పోరాటం చేసి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేకహోదాపై పోరాటం చేయాలి.     
 - ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే, జమ్మలమడుగు
 
 నిరాశ కలిగించిన బడ్జెట్
 ఈ బడ్జెట్ నిరాశక్తి కలిగించే విధంగా ఉంది. పోలవరానికి రూ. 100 కోట్లు కేటాయించడం దారుణం. పోలవరంకు ఇంత తక్కువ నిధులు కేటాయించడం బట్టి చూస్తే పోలవరం త్వరగా పూర్తి చేయడం ఇటు రాష్ట్రానికి అటే కేంద్రానికి ఇష్టం లేదనే విషయాన్ని స్పష్టమవుతోంది. రాయలసీమకు కనీసం ఒకటి కూడా సెంట్రల్ యూనివర్శీటీని ప్రకటించకోవడం విచారకరం. ఈ బడ్జెట్ రైతులను ఆదుకొనే విధంగా లేదు.     
 - గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే, రాయచోటి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement