బడ్జెట్‌లో ‘అనంత’కు అన్యాయం
నిధుల సాధనకు పోరాటమే మార్గం
చర్చావేదికలో వక్తల అభిప్రాయం
అనంతపురం అర్బన్ : రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, బడ్జెట్ సాధనకు పోరాటం ఒక్కటే మార్గమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్జీఓ హోంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప అధ్యక్షతన ఆదివారం ‘రాష్ట్ర బడ్జెట్- అనంతపురం జిల్లా’ అంశంపై జరిగిన చర్చావేదికలో ఎస్‌కేయూ ప్రొఫెసర్ బాబయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్.ఎం.బాషా, ప్రొఫెసర్ వెంకటనాయుడు ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు కేవీరమణ ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడారు.
జిల్లాను అభివృద్ధి చేస్తామంటూ చేస్తున్న ప్రకటనలకు, బడ్జెట్ కేటాయింపునకు పొంతన లేదన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజా ఉద్యమాలు నిర్మించి ఐక్య పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.1.35 లక్షల బడ్జెట్లో ప్రణాళిక వ్యయం రూ.49 కోట్లు మాత్రమే ఉందన్నారు.
ఇంత తక్కువతో ఏ విధమైన అభివృద్ధి సాధ్యమన్నారు. రూ.2 వేల కోట్లు అవసరమున్న హంద్రీ-నీవాకు రూ.504 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని, జిల్లాకు సాగునీరు ఎప్పటికి అందుతుందన్నారు. రూ.7 వేల కోట్లతో ఆమోదం పొందిన ‘ప్రాజెక్టు అనంత’ను ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాయలసీమ అభివృద్ధి, అనంతపురం జిల్లాకు నిధులు కేటాయింపు కోసం ఈ నెల 15న ఛలో అసెంబ్లీ చేపట్టామని రాంభూపాల్ చెప్పారు. అంశాల వారీగా డిమాండ్ల పత్రాన్ని సిద్ధం చేసి జిల్లా ప్రజాప్రతినిధులందరికీ ఉత్తరాల ద్వారా తెలుపుతామన్నారు. కార్యక్రమంలో జేవీవీ నాయకులు డాక్టర్ వీరభద్రయ్య, సామాజిక నాయకులు తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి, చిల్లర వర్తకుల సంఘం నాయకులు గూడూరు వెంకటనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, పాత్రికేయులు నాగరాజు, రవిచంద్ర, సామాజిక నాయకులు పసులూరి ఓబులేసు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శ పెద్దిరెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.