ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తుంటారని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు.
కె.కోటపాడు : ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తుంటారని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని చౌడువాడలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు ఎంపికైన బీసీలకు పదవి దక్కకపోవడం విచారకరమన్నారు. మొదటిసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అశోక్ గజపతిరాజుకు, రెండోసారి సుజనా చౌదరికి మంత్రి పదవులు దక్కాయన్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి బీసీకి చెందిన ఒక్క ఎంపీకీ మంత్రి పదవి లభించలేదన్నారు. ఈమాత్రం దానికి బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు చంద్రబాబు ప్రచారార్భాటం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే బాబు బీసీలపై ప్రేమ ఒలకబోస్తారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల నాయకులు దాట్ల తాతరాజు, రెడ్డి జగన్మోహన్, దాట్ల శివాజీబాబు, బోయిదాపు జగదీశ్వరరావు, ఎటుకూరి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.