చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు: బుగ్గన
విజయవాడ: ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం సరికాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ప్రజల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధిత ప్రాంతాలపై ప్రభుత్వ వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ లెక్కలన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయని బుగ్గన విమర్శించారు. వాస్తవాలను చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని బుగ్గన వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తున్నారని ఆయన అన్నారు.
రైతులు పెట్టిన భోజనం తినలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తినే ప్రతి ముద్దను రైతును తలుచుకుని తినే సంస్కారం వైఎస్ రాజశేఖరరెడ్డి నేర్పారన్నారు. యనమల రామకృష్ణుడు లాంటి ఆర్థిక మంత్రిని ఎక్కడా చూడలేదని, ఆయన చూపిన లెక్కలకు...వాస్తవాలకు పొంతన లేదన్నారు. యనమల అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. అలాగే సొంత డబ్బా కొట్టుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటు అయిపోయిందని బుగ్గన ఎద్దేవా చేశారు. సత్యానాదేళ్లను తానే మైక్రోసాఫ్ట్ రంగాన్ని ఎంచుకోమన్నానని, ఇక పీవీ సింధు కూడా తనవల్లే ఒలింపిక్స్ లో పతకం సాధించిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.