ధాన్యం.. దైన్యం | But they were bundled out for trouble from the beginning | Sakshi
Sakshi News home page

ధాన్యం.. దైన్యం

Published Wed, Feb 12 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

But they were bundled out for trouble from the beginning

ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో అన్నదాతను ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. అష్టకష్టాలు పడి పండించుకున్న పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ధరలు భారీగా తగ్గడం, పెట్టుబడి పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయమయ్యాయి. జిలకర మసూరి రకం ధాన్యం పండించిన రైతుల కష్టాలు మరోలా ఉన్నాయి. ఈ ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదని కొనుగోలు కేంద్రాల సిబ్బంది చెబుతుండటంతో వ్యాపారులు, దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.
 
 ఉదయగిరి, న్యూస్‌లైన్: ఈ ఏడాది ఉదయగిరి నియోజకవర్గంలో వరి సాగు చేసిన రైతులు అప్పులపాలయ్యారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. విం జమూరు సబ్‌డివిజన్ పరిధిలో సాధారణ వరి విస్తీర్ణం 16 వేల హెక్టార్లు. ఈ ఏడాది 13,500 హెక్టార్లలో వరి సాగు చేశారు.  ఇందులో సు మారు ఐదు వేల హెక్టార్లలో వరి ఎండిపోయింది. మిగిలిన సాగులో కూడా దిగుబడి దారుణంగా పడిపోయింది. ఉదయగిరి సబ్‌డివిజన్ పరిధిలో సాధారణ వరి విస్తీర్ణం 5,300 హెక్టార్లు కాగా ప్రస్తుతం 2,500 హెక్టార్లలో సాగైంది. ఇందులో 500 హెక్టార్లలో వరి ఎండిపోయింది. మిగిలిన దాంట్లో కూడా దిగుబడి అంతంత మాత్రమే.
 
 పెరిగిన పెట్టుబడులు
 గత ఏడాది కంటే ఈ ఏడాది పెట్టుబడులు 50 శాతంపైగా పెరిగాయి. గత ఏడాది ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి కాగా, ఈ ఏడాది రూ.25 వేలు దాటింది. పైగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటను కాపాడుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకునేందుకు జనరేటర్లు, ఇంజిన్లు, పట్టలు, పైపుల కొనుగోలుకు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది కూడా రైతులకు భారంగా మారింది. తీరా దిగుబడి చూస్తే షాక్ తగిలినట్టైంది. ఎకరాకు 40 బస్తాలు పైగా దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం 20 బస్తాలకే పరిమితమై రైతన్నకు అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఐదు నెలలు కష్టించగా నష్టం మాత్రమే చేతికి మిగిలింది.
 
 మద్దతు హుళక్కే:
 ప్రభుత్వం పెరిగిన ఖర్చులు, పెట్టుబడులకు అనుగుణంగా వరి ధాన్యానికి మద్దతు పెంచడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పెట్టుబ డులు భారీగా పెరుగుతున్నా, మద్దతు ధర మాత్రం ఆ మేరకు పెంచడం లేదు. ఏడాదికి రూ.50 లోపు మాత్రమే క్వింటాలుకు పెంచుతోంది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కర్నాటకలో క్వింటాకు మద్దతు ధర రూ.1600  , మహారాష్ట్రలో రూ.1650 ఉంది. ఇక్కడ మాత్రం రూ.1310 మాత్రమే ఉండటం గమనార్హం. పైగా ఆ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.100-150 అదనంగా చెల్లిస్తోంది.
 
 అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలు
 కోట: అధికారులు ఆర్భాటంగా ప్రారంభిం చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా బో నీ కాలేదు. కోట మండలంలోని తిన్నెలపూడి,సిద్దవరం, ఊనుగుంటపాళెం సహకార సం ఘాల ఆధ్వర్యంలో గత నెలలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్ర భుత్వం ప్రకటించిన ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఇటువైపు రావడం లే దు.
 
 వ్యాపారులు, దళారులు మాత్రం అదనంగా కొంత మొత్తం చెల్లించి కొనుగోళ్లు జరుపుతున్నారు. మరోవైపు సూపర్‌ఫైన్‌గా పరిగణించే జిలకర మసూరి రకానికి ప్రభుత్వం ఇంకా ధర ప్రకటించ లేదని కొనుగోలు కేం ద్రాల సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు ధర దారుణంగా తగ్గించేశారు. గత సీజన్‌లో పుట్టి రూ.15 వేలు వరకు పలికిన ఈ రకం ధాన్యాన్ని ప్రస్తుతం రూ.13 వేలు లోపే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు.
 
 తగ్గిన దిగుబడులు
 వాకాడు:  వాకాడు మండలంలో సుమారు 15 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా నీళ్లు చాలక 4 వేల ఎకరాల్లో ఎండిపోయింది. గుంతలు, వాగులు, రొయ్యల చెరువులోని వ్యర్థనీటిని ఆయిల్ ఇంజన్లతో తోడుకుని పంటలు పం డించారు. పంటకు సరిపడా నీళ్లు అందించలేకపోవడంతో దిగుబడి బాగా తగ్గింది. ధాన్యం కూడా తేలికగా మారాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యానికి మద్దతు ధర లేకపోవడంతో రైతు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో దళారులు అడిగిన ధరకే విక్రయించేస్తున్నారు. కొందరు రైతులు మాత్రం ఖర్చులకు ఓర్చి ఆరబెట్టుకుంటున్నారు.
 
 పొలాల్లోనే నిల్వ
 చిల్లకూరు: మార్కెట్‌లో బియ్యం ధరలు చుక్కలు అంటుతుంటే ధాన్యం ధరలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. తీరప్రాంత గ్రామాలైన బల్లవోలు, వేళ్లపాళెం, కాకువారిపాలెం, కోవూరువారిపాళెంలోని సుమారు 500 ఎకరాల్లో జిలకర మసూరి సాగు చేపట్టారు. అప్పట్లో పుట్టి ధాన్యం ధర రూ.14,500 పలుకుతుండటంతో రైతులు ఉ త్సాహంగా పెట్టుబడులు పెట్టారు. పంట చేతి కొచ్చే సరికి ఈ ధర క్రమేణా దిగజారి ప్రస్తు తం రూ.12,500 చేరుకుంది. ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడి కూడా రాకపోతుండటంతో రైతులు ధాన్యాన్ని పొలాల్లోనే ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లోనైనా అమ్ముకుందామంటే అక్కడ మసూరికి ఇంకా ధర నిర్ణయించలేదనే సమాధానం వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి అన్ని రకాల ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.
 
 దళారులే దిక్కు
 జలదంకి: మండలంలో వరికోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే బ్రాహ్మణక్రాక, జలదంకిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఉపయోగపడటం లేదు. ఈ కేంద్రాల్లో సిబ్బంది ఉండటం లేదు. ఉంటే గోతాలు లేవని చెబుతుండటంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా అన్నదాతను దళారులు నిలువునా ముంచేస్తున్నారు.
 
 ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి పుట్టికి రూ.11,433, బీ గ్రేడ్‌కు రూ.11,435 మద్దతు ధర ప్రకటించింది. దళారులు మాత్రం ఈ గ్రేడ్‌ల పరిధిలోకి వచ్చే ఎంటీయూ 1010, ఎన్‌ఎల్‌ఆర్ 145(స్వర్ణముఖి), ఎన్‌ఎల్‌ఆర్ 30491 (భరణి), నెల్లూరు జిలకర, సన్నాలు తదితర రకాలను రూ.11 వేలకు మించి కొనడం లేదు. మళ్లీ తేమ, తాలు పేరుతో కోత విధిస్తున్నారు. మరోవైపు తూకాల్లో మోసం చేస్తూ బస్తాకు రూ.4 కిలోల వరకు మోసం చేస్తున్నారు. అయినా రైతులకు విధిలేని పరిస్థితుల్లో దళారులే దిక్కవుతున్నారు.
 
 ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే కఠినచర్యలు
 నెల్లూరు(పొగతోట) : రైస్ మిల్లర్లు, దళారులు రైతుల నుంచి ధర తగ్గించి కొనుగోలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు 103 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

 మిగిలిన 47 కొనుగోలు కేంద్రాలు వారంలోపు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధరలకే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. సూపర్‌ఫైన్ ధాన్యం (క్వింట) రూ.1500, ఏగ్రేడ్ రూ.1345, సాధరణ రకం ధాన్యం రూ.1315లకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యం తక్కువ ధరలకు కొనుగోలు చేస్తే 80083 01500, 90004 00926 ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
 
 విధిలేకే:
 వరికోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదు. మరోదారి లేక దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వాళ్లు ఇష్టారాజ్యంగా ధరల్లో తేడాలు చెబుతూ కొనుగోలు చేస్తున్నారు. నష్టాలు తప్పేటట్టు లేవు.
 - అక్కల శ్రీనివాసులరెడ్డి, రైతు, బ్రాహ్మణక్రాక
 
 మద్దతు ధరను పెంచాలి :
 ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎకరాకు రూ.30 వేల వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టాం. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరను పెంచాలి.
 -షేక్ రెండో సుభాన్,
 రైతు, బీకే అగ్రహారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement