అన్నదాతంటే అలుసా?
ఉదయగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంపై ప్రభుత్వం పరిహాసం చేస్తోంది. మూడేళ్ల పాటు వరుసగా తుపాన్లు, వర్షాలతో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయారు. భారీ స్థాయిలో రైతులకు నష్టం వాటిల్లినా సర్వేల పేరుతో పెద్ద ఎత్తున కోత విధించారు. పంట నష్ట పరిహార జాబితాలో ఉన్న రైతులకు కూడా మూడేళ్ల నుంచి నష్టపరిహారం ఇవ్వలేదు. రేపు.. మాపు అంటూనే కాలం వెళ్లదీస్తున్నారు.
జిల్లాలో 2011 థానే తుపాను, 2012 జనవరి, 2013 ఫిబ్రవరి, మే నెలల్లో అకాల వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. థానే తుపాను, 2012 జనవరిలో కురిసిన అకాల వర్షాలు రైతుల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. లక్షల ఎకరాల్లో వరి, మినుము తీవ్రంగా దెబ్బతింది. కావలి, కొండాపురం, కలిగిరి, చేజర్ల, చిట్టమూరు, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, జలదంకి తదితర మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మినుము పూర్తిగా నీటిపాలైంది. అప్పుడే కోతకొచ్చిన వరి కూడా తీవ్రంగా దెబ్బతింది.
పొగాకు, శనగ, పెసర, పొద్దుతిరుగుడు రైతులు కూడా నష్టాల బారినపడ్డారు. దీంతో రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పినా నష్టాలను అంచనాలు వేయడంలో మీనమేషాలు లెక్కించింది. నష్టాల అంచనాలకు ఆలస్యంగా రాష్ట్ర అధికారుల బృందం పంపించింది. ఈ బృందం ఉదయగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని స్వయంగా పరిశీలించింది. వేల ఎకరాల్లో నష్టం జరిగినా, ఏదో మొక్కుబడిగా సర్వే జరిపి నష్టపరిహారాన్ని అధికారులు తక్కువగా చూపించారు. అయినా రైతులకు మాత్రం ఇంతవరకు పరిహారం అందలేదు. 2013లో కురిసిన అకాల వర్షాలతో డెల్టా, తీరంలో వరిసాగు తీవ్రంగా దెబ్బతింది. వందల ఎకరాలు నీటమునిగాయి.
నష్టం కొండంత..
పరిహారం అంచనా గోరంత..
ఈ మూడేళ్లల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అయితే అధికారులు సక్రమంగా సర్వే చేయకుండా రైతులకు తీరని ద్రోహం చేశారు. వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అనేక మంది రైతులను పంట నష్టం పరిహారం జాబితాలో చేర్చలేదు. చివరకు 11,558 హెక్టార్లలో వరి, మినుము, వేరుశనగ, శనగ, పొగాకు తదితర పంటలకు నష్టం వాటిల్లిందని నిర్ధారణ చేశారు.
7,342 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జాబితా రూపొందించారు. వీరందరి చేత బ్యాంకు ఖాతాలు తెరిపించారు. కానీ ఆ ఖాతాల్లో పైసా కూడా జమ కాలేదు. పంటనష్ట పరిహారం కింద డబ్బులు మంజూరయ్యాయని ప్రచారం కూడా జరిగింది. కానీ అవి రైతులకు అందలేదు. మూడేళ్లుగా పంట నష్టపరిహారం అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయశాఖాధికారులు స్పందించి రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.