కేబినెట్‌ భేటీ వాయిదా | Cabinet meeting postponed | Sakshi
Sakshi News home page

కేబినెట్‌ భేటీ వాయిదా

Published Wed, May 8 2019 4:04 AM | Last Updated on Wed, May 8 2019 6:55 AM

Cabinet meeting postponed - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నందున ఈనెల పదో తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యంకాదని తేలిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌ భేటీని నాలుగు రోజులపాటు వాయిదా వేసుకుని 14వ తేదీన జరపాలని నిర్ణయించారు. ఆ రోజు ఉ.10.30 గంటలకు కేబినెట్‌ సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారని, ఇందుకు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శి సాయిప్రసాద్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్మణ్యంకు మంగళవారం లేఖ పంపారు.

ఈ అంశం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్‌ సమావేశం జరిగే అవకాశం ఉందా? లేదా? అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రశ్నిస్తే.. అనుమానమేనని, ఈ అంశం కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ‘నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాల్సినంత అత్యవసర పరిస్థితులేమీ లేవు. అయితే, సీఎం మాత్రం ఎలాగైనా సమావేశం జరపాలని పట్టుదలతో ఉన్నారు.

ఈనెల 10వ తేదీన కేబినెట్‌ నిర్వహణకు ఏర్పాట్లుచేయాలంటూ సీఎంఓ పంపిన నోట్‌లో అజెండా లేకుండా ఉన్నందున అది పనికిరాదనే ఉద్దేశంతో తాజాగా అజెండాతో 14వ తేదీకి వాయిదా వేసుకున్నట్లు లేఖ పంపింది. కరువు, ఫొని తుపాను అంశాలను చర్చించాలంటూ అజెండాలో చేర్చడం ఇందులో భాగమే. వాస్తవానికైతే ప్రస్తుతం వీటిపై కేబినెట్‌ చర్చించి చేసేదేమీ ఉండదు. సీఎం రాజకీయం కోసం పట్టుబడుతున్నారు. ఏమవుతుందో చూడాలి. ఇదంతా ఎందుకు.. అనుమతిస్తే పోతుందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తే తప్ప వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన అయితే కేబినెట్‌ నిర్వహించాల్సిన పరిస్థితి  లేనేలేదు’ అని పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ‘సాక్షి’తో అన్నారు. 

ఆయా శాఖలు ఏ నివేదికలు ఇస్తాయో?
కాగా, సీఎస్‌ నుంచి నోట్‌ తమకు చేరగానే ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖకు సంబంధించిన అజెండాలోని అంశాలపై కేబినెట్‌లో ప్రస్తుతం చర్చించాల్సినంత అవసరం ఉందా? లేదా అనే దానిపై నిర్ణయానికి రావాలి. దీనిని సంబంధిత శాఖ మంత్రికి పంపించి వారి ఆమోదంతో సీఎస్‌కు పంపించాలి. అలాగే, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా ఏమి చేయాలన్నా ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కోడ్‌కు సంబంధంలేని అంశమని ఈ కమిటీ భావిస్తే అమలుకు అనుమతిస్తుంది. ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అంశాలైతే ఈ కమిటీనే ఏయే కారణాలవల్ల వీటి అమలుకు అనుమతించాలో వివరిస్తూ సీఈసీకి నివేదిస్తుంది. అలాంటి అత్యవసరంలేదని కమిటీ భావిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపే పరిస్థితే ఉత్పన్నం కాదు. అయితే, సాధారణంగా ఈ కమిటీ సీఎంఓ పంపిన నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోవచ్చని ఒక ఉన్నతాధికారి తెలిపారు. 

సీఈసీ ఆమోదమే ఫైనల్‌ 
కాగా, మోడల్‌ కోడ్‌ నుంచి మినహాయింపునిచ్చి కేబినెట్‌ నిర్వహణకు అనుమతించాల్సినంత అత్యవసర పరిస్థితి ఉందని కమిటీ పేర్కొన్న అంశాలు సీఈసీకి నమ్మకం కలిగించాలి. కానీ, లేదని కమిషన్‌ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వ వినతిని తిరస్కరిస్తుంది. ఒకవేళ సీఎస్‌ నుంచి వచ్చిన విజ్ఞాపన సహేతుకమై, అత్యవసరమైనదేనని భావిస్తే మాత్రం అనుమతిస్తుంది. ఇలా అనుమతిస్తే మాత్రం కేబినెట్‌ నిర్వహించడానికి మార్గం సుగమమవుతుంది. లేదంటే వీలు కాదు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏమీలేవు. అందువల్ల కేబినెట్‌ నిర్వహణకు సీఈసీ అనుమతిచ్చే అవకాశాలు చాలా తక్కువే’ అని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి వివరించారు. 

కేబినెట్‌కు ఈసీ అనుమతి ఉండాల్సిందే : సీఎస్‌
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టంచేశారు. కేబినెట్‌ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలనుకుంటున్న అజెండాను ముఖ్యమంత్రి కార్యాలయం పంపితే దాన్ని ఎన్నికల సంఘం అనుమతికి పంపుతామన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన పలువురు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ఈ అజెండాను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల సంఘం 48 గంటల సమయం కోరుతోందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకుని ముందుకెళ్తామని సీఎస్‌ చెప్పారు. అంతకుముందు కేబినెట్‌ సమావేశ నిర్వహణపై ఎల్వీ.. ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ శ్రీకాంత్‌తో చర్చలు జరిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement